మహారాష్ట్ర నాసిక్‌లోని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) యూనిట్‌లో లైంగిక వేధింపులు, బలవంతపు మత మార్పిడి ఆరోపణలు వెలుగులోకి రావడంతో దేశం ఉలిక్కి పడింది. గత నాలుగేళ్లుగా సీనియర్ ఉద్యోగులు ఈ ఘాతుకాలకు పాల్పడ్డారంటూ మొత్తం తొమ్మిది మంది ఫిర్యాదులు చేశారు. సంచలన కేసు కావడంతో సిట్ లోతుగా దర్యాప్తు జరుపుతుండగా.. సంస్థపై మచ్చ పడడంతో టీసీఎస్ ఈ అంశాన్ని తీవ్రంగానే పరిగణిస్తోంది. ఈ తరుణంలో..
సిట్‌కు ఈ కేసు నిందితురాలు నిదా ఖాన్(Nida Khan) ఝలక్‌లు ఇస్తోంది. ఇప్పటికే పరారీలో ఉన్న ఆమె.. అరెస్ట్ నుంచి రక్షణ కోరుతూ నాసిక్ లోకల్ కోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేసింది. తాను గర్భవతినని, ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ అందులో పేర్కొంది. ప్రస్తుతం ఆమె ముంబైలో తలదాచుకున్నట్లు సిట్‌కు సమాచారం అందింది. ఈ మొత్తం వ్యవహారంలో నిదా ఖానే ప్రధాన నిందితురాలు అయ్యి ఉండొచ్చని సిట్ భావిస్తోంది. యాంటీసిపేటరీ బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చేలోగా.. వీలైనంత త్వరగా ఆమెను అదుపులోకి తీసుకోవాలని సిట్ ప్రయత్నిస్తోంది.
మరోవైపు.. వేధింపుల వ్యవహారంలో హెచ్‌ఆర్ హెడ్‌గా నిదా ఖాన్ కీలక పాత్ర పోషించినట్లు దర్యాప్తు బృందం భావించింది. అయితే.. ఈ విషయంలోనూ పోలీసులకు మరో ఝలక్ తగిలింది. ఆమె అసలు హెచ్‌ఆర్ హెడ్ కాదని టీసీఎస్ ప్రకటించింది. ఆమె సాధారణ టెలికాలర్ అని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. పోలీసులు ఫైల్ చేసిన ఎఫ్‌ఐఆర్‌లో ఆమెను హెచ్‌ఆర్ హెడ్‌గా పేర్కొనడం గమనార్హం.
హైబ్రిడ్ టెర్రరిస్ట్ కుట్ర?
నిదా ఖాన్‌కి ఢిల్లీ పేలుళ్ల నిందితులతో సంబంధం ఉందంటూ పలు జాతీయ మీడియా సంస్థలు కథనాలు ఇచ్చాయి. జైషే (Jaish-e-Mohammed) ఉగ్రవాదిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న డాక్టర్ షాహీన్ షాహిద్‌తో సంబంధం ఉందని ఆ కథనాల సారాంశం. దీంతో.. ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ రంగంలోకి దిగింది.
నాసిక్ టీసీఎస్ బీపీవో యూనిట్‌లో పని చేసే ఎనిమిది మంది మహిళా ఉద్యోగులు, ఒక పురుష ఉద్యోగి తమపై జరిగిన మానసిక, శారీరక వేధింపులు, మత అవమానాలు, బలవంతపు మత మార్పిడి ప్రయత్నాల గురించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుల ప్రకారం.. టీమ్ లీడర్లు, కొంతమంది సీనియర్ ఉద్యోగులు.. ‘‘మహిళా ఉద్యోగులను మానసికంగా, శారీరకంగా వేధించారు. తప్పుడు హామీలతో ఇచ్చి శారీరక సంబంధం పెట్టుకున్నారు.హిందూ దేవతలను అవమానించారు, పండుగల సమయంలో సాంప్రదాయ దుస్తులు ధరించిన మహిళలను ఎగతాళి చేశారు.నమాజ్ చేయమని బలవంతపెట్టారు, మతాన్ని అవమానించారు. ఉద్యోగులను హోటళ్లకు, రిసార్ట్స్‌కి రావాలని ఒత్తిడి చేశారు. వీటన్నింటికి తోడు.. చర్యలు తీసుకోవాలని హెచ్‌ఆర్ విభాగం ఫిర్యాదులను పట్టించుకోకుండా నిందితులనే ప్రొత్సహించింది.
ఈ కేసులో ఇప్పటిదాకా ఏడుగురిని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్‌కు తరలించారు. ఇందులో ఆరుగురు పురుష ఉద్యోగులు, ఒక మహిళా ఉద్యోగిణి ఉన్నారు. నిదా ఖాన్ ఇంకా అరెస్ట్ కావాల్సి ఉంది.
ఈ విషయాన్ని ఉపేక్షించేది లేదని TCS అంటోంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగులను కంపెనీ నుంచి సస్పెండ్ చేసింది. పోలీసు విచారణకు పూర్తి సహకారం అందిస్తామని ప్రకటించింది. టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ఈ ఘటనపై స్పందిస్తూ.. తీవ్రంగా ఆందోళన కలిగించే విషయం అన్నారు. కంపెనీ సీవోవో ఆరతి సుబ్రహ్మణియన్ ఆధ్వర్యంలో అంతర్గత విచారణ కొనసాగుతుందని తెలిపారాయన.
ఈ కేసు దేశవ్యాప్తంగా.. మరీ ముఖ్యంగా ఐటీ రంగంలో మత మార్పిడి, లైంగిక వేధింపులపై చర్చలకు దారితీసింది. సుప్రీం కోర్టులో కూడా బలవంతపు మత మార్పిడి నియంత్రణపై పిటిషన్ దాఖలైంది. ఈ ఉదంతం దేశంలోని సార్వభౌమత్వం, సెక్యులరిజం, ప్రజాస్వామ్యం, ఐక్యతకు ముప్పుగా అభివర్ణించిన పిటిషనర్ లాయర్ అశ్విని కుమార్ ఉపాధ్యాయ్.. బలవంతపు మత మార్పిడిని ‘టెర్రరిస్ట్ యాక్ట్’గా ప్రకటించాలని కోర్టును కోరారు.


