టీసీఎస్‌ నాసిక్‌ కేసు.. వెలుగులోకి మరో షాకింగ్‌ ఘటన! | TCS Nashik Case : Male employee Shocking Testimony | Sakshi
Sakshi News home page

టీసీఎస్‌ నాసిక్‌ కేసు.. వెలుగులోకి మరో షాకింగ్‌ ఘటన!

Apr 16 2026 11:06 AM | Updated on Apr 16 2026 11:21 AM

TCS Nashik Case : Male employee Shocking Testimony

సంచలనంగా మారిన టీసీఎస్‌ నాసిక్‌ క్యాంపస్‌ వ్యవహారంలో మరో షాకింగ్‌ ఘటన వెలుగు చూసింది. లైంగిక వేధింపులు, మత మార్పిడులకు పాల్పడ్డారన్న ఆరోపణలతో కొంతమంది ఉద్యోగులను(మాజీ) పోలీసులు ఇప్పటికే అరెస్ట్‌ చేసి విచారిస్తున్నారు. ఈ క్రమంలో బాధితులు ముందుకు వస్తుండడంతో విస్తుపోయే విషయాలే వెలుగు చూస్తున్నాయి. 

ఇప్పటికే పలువురు మహిళా ఉద్యోగులు లైంగిక వేధింపులు, బలవంతపు మతమార్పిడి ప్రయత్నాలు జరిగాయని ఫిర్యాదు చేశారు. ఇప్పుడు ఓ పురుష ఉద్యోగి మతం మారాలంటూ తననూ బలవంత పెట్టారని.. ఈ క్రమంతో తన వ్యక్తిగత జీవితాన్ని లక్ష్యంగా చేసుకున్నారని చెప్పుకొచ్చారు. 

‘‘నేనొక హిందువుని. వాళ్లు నా మత విశ్వాసాలను ఎగతాళి చేసేవారు. నేను మొక్కే దేవుళ్లపై అవమానకర వ్యాఖ్యలు చేసేవారు. నైట్‌ షిఫ్ట్‌ల సమయంలో బలవంతంగా బయటకు తీసుకెళ్లి నాన్‌ వెజ్‌ తినమని వేధించేవారు. వాళ్లకు ఎంత దూరంగా ఉండాలని ప్రయత్నించినా.. వదిలేవాళ్లు కాదు. 

2023లో రంజాన్‌ టైంలో టీమ్ లీడర్ తౌసిఫ్ అట్టార్ ఓ రోజు తన ఇంటికి తీసుకెళ్లి.. నా నెత్తి మీద టోపీ పెట్టి నమాజ్‌ చేయమంటూ ఒత్తిడి చేశాడు. ఆ సమయంలో ఫొటోలు తీసి వాటిని కంపెనీ గ్రూపులో షేర్‌ చేశాడు. ఆ తర్వాత నా వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్‌ చేశారు.

నా తండ్రి పక్షవాతం బారిన పడినప్పుడు.. ఇస్లాం మతం స్వీకరిస్తే ఆయన త్వరగా కోలుకుంటాడు అని చెప్పారు. అందుకు ఒప్పుకోకపోయేసరికి.. నాపై వేధింపులు ఎక్కువ అయ్యాయి. నాకు ఇంకా పిల్లలు పుట్టలేదు. ఆ విషయంపైనా వెకిలిగా ప్రవర్తించేవాళ్లు. ‘పిల్లలు కావాలంటే నీ భార్యను పంపు’ అని అసభ్యంగా మాట్లాడేవారు. ఈ విషయాలపై ఫిర్యాదు చేయడానికి ప్రయత్నిస్తే.. హెచ్‌ ఎగ్జిక్యూటివ్ నిదా ఖాన్ వద్దని సర్దిచెప్పింది. ఫిర్యాదు చేస్తే ఎంక్వైరీ ఉంటుందని.. ఉద్యోగం పోయినా పోవచ్చని బెదిరించేది అని బాధితుడు తన వాంగ్మూలంలో చెప్పుకొచ్చాడు. 

బీపీవో కార్యకలాపాలు నిలిపివేత..
నాసిక్‌లో ఉన్న టీసీఎస్‌ క్యాంపస్‌లో బీపీవో(BPO) సెంటర్ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేశారు. లైంగిక వేధింపులు, బలవంతపు మతమార్పిడి కేసుల వివాదం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగులను ఇంటినుంచే పని చేయాలని (Work From Home) గురువారం నుంచి ఆదేశించారు. తదుపరి సమాచారం వచ్చే వరకు ఈ తాత్కాలిక మూసివేత కొనసాగుతుందని తెలిపారు.

ఆమెకూ 14 రోజుల రిమాండ్‌
ఈ కేసులో హెచ్‌ఆర్‌ మేనేజర్‌ అసిఫ్‌ అన్సారీ సహా ఏడుగురు ఉద్యోగులను అదుపులోకి తీసుకున్నారు. టీమ్ లీడర్ తౌసిఫ్ అట్టార్, సహోద్యోగి డానిష్ షేక్‌లను ప్రధాన నిందితులుగా చేర్చారు. మరో ఇద్దరు మహిళా ఉద్యోగులను నిందితులుగా చేర్చి అరెస్ట్‌ చేశారు. హెచ్‌ఆర్‌ ఎగ్జిక్యూటివ్ నిదా ఖాన్‌ పరారీలో ఉంది. అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌ అశ్విని చయ్‌నాని కూడా కీలక పాత్ర పోషించినట్లు తేలింది. 

సిట్‌ విచారణలో.. అశ్విని చయ్‌నాని ప్రధాన నిందితుడు తౌసిఫ్‌ అట్టార్‌తో దగ్గరి సంబంధాలు కలిగి ఉన్నారని.. 78 సార్లు ఈ వ్యవహారంపైనే ఈమెయిల్స్‌ ద్వారా సంప్రదింపులు జరిపారని..  అందులో కుట్రకు సంబంధించిన వివరాలు ఉన్నాయని తేలింది. మలేషియా నుంచి ఓ మత పెద్ద సూచనల మేరకు నిందితులు నడుచుకున్నారని తెలుస్తోంది. తాజాగా అశ్వినిని కోర్టులో ప్రవేశపెట్టగా.. 14 రోజుల రిమాండ్‌ విధించారు. ఈ కేసు నిందితులంతా నాసిక్‌ జైల్లో రిమాండ్‌ ఖైదీలుగా ఉన్నారు. 

సోషల్‌ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా ఈ వ్యవహారంపై  టీసీఎస్‌ స్పందించింది. అరెస్టయిన ఉద్యోగులను సంస్థ నుంచి తొలగించినట్లు తెలిపింది. పని ప్రదేశంలో ఇలాంటి వేధింపులను ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని స్పష్టం చేసింది. పోలీసు విచారణకు పూర్తి స్థాయిలో సహకరిస్తున్నామని తెలిపింది.

ఉలిక్కిపడ్డ ఐటీ రంగం.. 
నాసిక్‌ క్యాంపస్‌లో పని చేస్తున్న ఓ మహిళా ఉద్యోగి తన సహోద్యోగిపై ఫిర్యాదు చేశారు. పెళ్లి పేరుతో తనను మోసగించినట్లు అందులో పేర్కొన్నారు. దీనిపై దర్యాప్తు చేసే క్రమంలో మరో ఏడుగురు మహిళలు ముందుకొచ్చి.. తమపై జరిగిన వేధింపుల గురించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో హెచ్‌ఆర్‌ మేనేజర్‌ సహా అసిఫ్‌ అన్సారీ, షఫీ షేక్‌, షారుఖ్‌ ఖురేషి, రజా మేమన్‌, తౌసిఫ్‌ అత్తర్‌, డానిష్‌ షేక్‌ పేర్లు కూడా వెలుగులోకి వచ్చాయి. ఓ ప్రముఖ కంపెనీలో జరిగిన ఈ వ్యవహారంతో దేశ ఐటీ రంగం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. టీసీఎస్‌ సహా అన్ని సంస్థల్లో పని ప్రదేశంలో లైంగిక వేధింపుల నిబంధనలు పాటించడంపై సమగ్ర ఆడిట్‌ నిర్వహించాలని కార్మిక శాఖ మంత్రి మాన్‌సుఖ్‌ మాండవీయను జాతీయ ఐటీ ఉద్యోగుల సంఘం కోరింది.

తీవ్ర వేధింపులు..
2022 ఫిబ్రవరి నుంచి నాలుగేళ్లపాటు వేధింపులకు పాల్పడినట్లు మహిళా ఉద్యోగులు తమ ఫిర్యాదుల్లో పేర్కొనడం గమనార్హం. అనుచితంగా తాకడం, అసభ్యకరమైన కామెంట్స్ చేయడం, బాడీ షేమింగ్‌, నాన్ వెజ్‌ తినాలని ఒత్తిడి చేయడం వంటివి చేశారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై హెచ్‌ఆర్‌ విభాగానికి మహిళా ఉద్యోగులు ఫిర్యాదు చేశారు. అయితే ఏజీఎం అశ్విని ఆ ఫిర్యాదులను తీసుకోకుండా పక్కన పెట్టారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. 

మారు వేషంలో.. 
ఈ వ్యవహారంపై నాసిక్‌ పోలీసులు అండర్‌ కవర్‌ ఆపరేషన్‌ చేపట్టారు. ఏడుగురు మహిళా పోలీసులు మారు వేషంలో టీసీఎస్‌ క్యాంపస్‌లోకి ప్రవేశించారు. ఈ క్రమంలో ఓ మహిళా ఉద్యోగి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఓ వ్యక్తిని రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆపై సీసీఫుటేజీల ఆధారంగా కేసు లోతుల్లోకి వెళ్లే కొద్దీ షాకింగ్‌ విషయాలు వెలుగు చూస్తున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement