ఇండియా ఫస్ట్‌ లగ్జరీ ట్రైన్‌కు గడ్డు కాలం.. 43 ఏళ్ల చరిత్రలో.. | Rajasthan Palace On Wheels Train Sees Empty Seats Due To Iran War | Sakshi
Sakshi News home page

ఇండియా ఫస్ట్‌ లగ్జరీ ట్రైన్‌కు గడ్డు కాలం.. 43 ఏళ్ల చరిత్రలో..

Apr 21 2026 11:20 AM | Updated on Apr 21 2026 11:46 AM

Rajasthan Palace On Wheels Train Sees Empty Seats Due To Iran War

ప్యాలెస్ ఆన్ వీల్స్.. భారతదేశపు మొదటి లగ్జరీ హెరిటేజ్ ట్రైన్.. 1982లో ప్రారంభమైన ఈ విలాసవంతమైన రైలు.. రాజస్థాన్, ఆగ్రా ప్రాంతాల గుండా ప్రయాణిసూ.. 7 రాత్రులు/8 రోజుల పర్యటనలో కవర్ చేస్తోంది. ఎడారులు, కోటలు, చారిత్రక నగరాల గుండా సాగే ఈ ప్రయాణం పర్యాటకులకు రాజస్థాన్ రాజరిక వైభవాన్ని కళ్ళకు కట్టినట్లు చూపుతుంది. అయితే, ఇరాన్-అమెరికా యుద్ధం కారణంగా.. ఈ సీజన్‌లో అంతర్జాతీయ ప్రయాణాల మందగమనం సాగుతోంది.

విదేశీ ప్రయాణికులు లేకపోవడంతో ఈ రైలులో క్యాబిన్లు కూడా నిండటం లేదు. ముఖ్యంగా అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం, మధ్యప్రాచ్యంలో నెలకొన్న అస్థిరత, ఉద్రిక్తతలు ప్రపంచ పర్యాటకంపై పడింది. ముఖ్యంగా భారత్‌లోని పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ఈ సీజన్‌లో జైసల్మేర్‌కు జరిగిన చివరి ప్రయాణంలో కేవలం 30 మంది మాత్రమే ప్రయాణించారు. ఈ రైలు సామర్థ్యం 84 మంది కాగా.. చాలా తక్కువ మంది ప్రయాణించారు.

పర్యాటక రంగానికి పెద్ద దెబ్బ
తక్కువ బుకింగ్‌ల కారణంగా రెండు ప్రయాణాలను ముందుగానే రద్దు చేశారు. నిబంధనల ప్రకారం, రైలు నడవాలంటే కనీసం 14 క్యాబిన్‌లు బుక్ అవ్వాలి. కానీ ఈ సీజన్‌లో చాలాసార్లు ఆ సంఖ్య 10 కూడా దాటలేదు  సెప్టెంబర్ నుంచి ఏప్రిల్ వరకు ప్రణాళిక చేసిన 32 ట్రిప్పులలో 10 ట్రిప్పులు రద్దయ్యాయి, ఇది పర్యాటక రంగానికి పెద్ద దెబ్బగా అధికారులు చెబుతున్నారు.

43 ఏళ్ల చరిత్రలో..
43 ఏళ్ల చరిత్రలో షెడ్యూల్ చేసిన ప్రయాణాలలో దాదాపు మూడొంతులు రద్దు కావడం ఇది రెండోసారి. గత సీజన్‌లో కూడా ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం, రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం కారణంగా 10 ట్రిప్పులు రద్దయ్యాయి. కోవిడ్-19 మహమ్మారి తర్వాత ఈ రైలు ఆదరణ క్రమంగా తగ్గుతూ వచ్చింది. టికెట్ ధరలు రూ. 6 లక్షల నుండి రూ.21 లక్షల వరకు ఉండటం కూడా డిమాండ్ తగ్గడానికి ఒక కారణంగా అధికారులు చెబుతున్నారు. యుద్ధ వాతావరణం కారణంగా విదేశీయులు అంతర్జాతీయ ప్రయాణాలు చేయడానికి వెనుకాడుతున్నారు. గతంలో ప్యాలెస్ ఆన్ వీల్స్ 70 నుండి 80 శాతం ఆక్యుపెన్సీతో నడిచేది. కానీ ఈ సీజన్ చివరి ట్రిప్పులో అది కేవలం 26 శాతానికి పడిపోయిందని టూర్‌ ఆపరేటర్లు అంటున్నారు.

రాజస్థాన్ పర్యాటకంపై తీవ్ర ప్రభావం
లగ్జరీ రైలు బుకింగ్‌లు తగ్గడంతో రాజస్థాన్ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడింది. రైలు వచ్చే సమయంలో ప్రదర్శనలు ఇచ్చే స్థానిక జానపద కళాకారులు ఆదాయం కోల్పోయారు. అలాగే, జైసల్మేర్ వంటి నగరాల్లోని హోటళ్లు, గైడ్‌లు, చిన్న వ్యాపారస్తులు కూడా పర్యాటకులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ప్రత్యేకతలు ఏంటంటే..​
మొఘల్ చక్రవర్తులు, రాజస్థాన్ రాజుల వైభవాన్ని గుర్తు చేసే 'ప్యాలెస్ ఆన్ వీల్స్ రైలును 1982లో రాజస్థాన్ పర్యాటక అభివృద్ధి సంస్థ (RTDC), భారతీయ రైల్వే సంయుక్తంగా ప్రారంభించాయి. పూర్వం రాజస్థాన్, గుజరాత్ పాలకులు, బ్రిటిష్ వైస్రాయ్‌లు ప్రయాణించిన అసలైన కోచ్‌లను ఆధునికీకరించి దీనిని రూపొందించారు. ఇది ప్రపంచంలోని అత్యుత్తమ లగ్జరీ రైళ్లలో ఒకటిగా పలు అంతర్జాతీయ అవార్డులను గెలుచుకుంది.

ప్రయాణ మార్గం:
ఈ రైలు ఢిల్లీ రైల్వేస్టేషన్(సఫ్దర్‌జంగ్) నుంచి బయలుదేరి జైపూర్ చేరుకుంటుంది. అనంతరం రెండో రోజు జైపూర్ సిటీ ప్యాలెస్(హవా మహల్, అంబర్ కోట) సందర్శన ఉంటుంది. మూడో రోజు రత్నాంబోర్-ఫతేపుర్ సిక్రి చేరుకుంటుంది. నాలుగో రోజు ఆగ్రా చేరుకుని తాజ్ మహల్ సందర్శన అనంతరం ఖజురాహోకు ఐదో రోజు చేరుకుంటారు. అనంతరం ఆరో రోజు రాత్రి ఢిల్లీకి తిరుగు ప్రయాణం ప్రారంభమవుతుంది. చివరగా ఏడో రోజు మధ్యాహ్నం ఈ ట్రైన్‌ ప్రయాణం ముగుస్తుంది.

రైలులోని సౌకర్యాలు:
ప్రతి కోచ్ రాజస్థానీ శైలిలో అలంకరించబడి ఉంటుంది. వై-ఫై, అటాచ్డ్ బాత్‌రూమ్‌లు ఉంటాయి. 'మహారాజా, 'మహారాణి అనే రెండు అద్భుతమైన రెస్టారెంట్లు ఉన్నాయి. ఇక్కడ ఇండియన్, కాంటినెంటల్, రాజస్థానీ వంటకాలు లభిస్తాయి. ఖరీదైన వైన్, పానీయాలు లభించే బార్, విశ్రాంతి తీసుకోవడానికి లాంజ్ ఉన్నాయి. ప్రయాణ అలసటను పోగొట్టుకోవడానికి ఆయుర్వేద స్పా సౌకర్యం కూడా ఉంది.
 

Advertisement
 
Advertisement
Advertisement