తీర్థయాత్ర విషాదాంతం ఆరుగురు సజీవ దహనం | Pilgrimage tragedy Six burnt alive | Sakshi
Sakshi News home page

తీర్థయాత్ర విషాదాంతం ఆరుగురు సజీవ దహనం

Apr 18 2026 5:12 AM | Updated on Apr 18 2026 5:12 AM

Pilgrimage tragedy Six burnt alive

కృష్ణా నాయక్‌ కుటుంబ సభ్యులు (ఫైల్‌)

కారు, బస్సు ఎదురెదురుగా ఢీకొని చెలరేగిన మంటలు 

కారు డోర్లు తెరుచుకోకపోవడంతో ఆరుగురూ ఆహుతి

మృతులంతా రాయచూరు జిల్లా వాసులు 

ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలు  

చిన్నారులను కారు అద్దాలు పగలగొట్టి బయటకు లాగిన స్థానికులు  

సురక్షితంగా కిందకు దిగిన బస్సులోని ప్రయాణికులు   

యాదగిరి జిల్లా సురపుర తాలూకాలో ఘటన

రాయచూరు రూరల్‌: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తీర్థయాత్ర విషాదాంతమైంది. ఆరుగురు సజీవదహనమయ్యారు. ఇద్దరు పిల్లలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ దుర్ఘటన యాదగిరి జిల్లాలో శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో జరిగింది. యాదగిరి జిల్లా సురపుర తాలూకాలో జాతీయ రహదారి– 150పై శాంతాపుర వద్ద బెంగళూరు నుంచి కలబుర్గికి వెళుతున్న ప్రైవేట్‌ బస్సు, కలబుర్గి నుంచి లింగసుగూరు వైపు వస్తున్న కారు ఎదురెదురుగా బలంగా ఢీకొన్నాయి. ఆ వెంటనే  మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన బస్సులోని ప్రయాణికులందరూ కిందకు దిగారు. 

ప్రమాద తీవ్రతకు కారు డోర్లు తెరచుకోకపోవడంతో అందులోని ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ప్రయాణికులు బయటికి రాలేక సజీవ దహనమయ్యారు. ఇద్దరు పిల్లలకు తీవ్ర గాయాలయ్యాయి. వీరంతా రాయచూరు జిల్లా సిరవారకు చెందిన పంచాయతీ మాజీ సభ్యుడు కృష్ణానాయక్‌ కుటుంబ సభ్యులు.

తిరుగు ప్రయాణంలో దుర్ఘటన
అమావాస్య కావడంతో శుక్రవారం సురపురలోని వేణుగోపాల స్వామి ఆలయాన్ని దర్శించుకునేందుకు ఉదయాన్నే 6.30 గంటలకు రాయచూరు జిల్లా సిరవార నుంచి పట్టణ పంచాయతీ మాజీ సభ్యుడు కృష్ణా నాయక్‌ కుటుంబం కారులో బయలుదేరింది. స్వామిని దర్శించుకుని 10.45 గంటలకు తిరుగు ప్రయాణమైన కొద్దిసేపటికే ప్రమాదం జరగడంతో కృష్ణా నాయక్‌(52), ఆయన భార్య అనంతకళ(45), కుటుంబ సభ్యులు శరణప్ప (36), నిసర్గ (30), సిద్ధార్థ(3), శశికళ(30) మరణించారు. 

కారుడోర్లు తెరుచుకోకపోవడంతో సజీవదహనమయ్యారు. వెనకవైపు కూర్చున్న పిల్ల­లు అద్విక, శ్రీనిధి­ని అటుగా వెళ్లేవారు  అద్దాలు పగల­గొట్టి బయటకు లాగారు. అయినా అప్పటికే పిల్లలిద్దరు కూడా తీవ్రంగా గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం యాదగిరి ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించినట్లు జిల్లా ఎస్పీ పృథ్వీశంకర్‌ తెలిపారు. బస్సులో ప్రయాణిస్తున్న 20 మంది సురక్షితంగా బయట పడగా, కొందరికి స్వల్ప గాయాలయ్యాయి. 

మంటల్లో కారు, బస్సు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఘటనా స్థలాన్ని సురపుర ఎమ్మెల్యే వేణుగోపాల నాయక్‌ పరిశీలించారు. క్షతగాత్రులను పరామర్శించారు. కృష్ణా నాయక్‌తో పాటు కుటుంబ సభ్యులు దుర్మరణం చెందడంపై రాష్ట్ర చిన్న నీటిపారుదల శాఖ మంత్రి బోసురాజు, ఎమ్మెల్యేలు హంపయ్య నాయక్, బసనగౌడ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement