జైపూర్: రాజస్థాన్‌లో ఓ అవినీతి అధికారి ఏసీబీ అధికారుల చేతికి చిక్కింది. భూవ్యవహారానికి సంబంధించిన దందాలో రూ. 60 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా అధికారులకు పట్టుబడింది. గతంలో తను ఇచ్చిన ఓ ఇంటర్వూలో అవినీతిని అంతమెుందిస్తానంటూ ప్రగల్భాలు పలికిన ఈ అధికారి ఇప్పుడు తానే లంచం తీసుకుంటూ పట్టుబడడంతో ఇప్పుడు ఈ వార్త చర్చనీయాంశమైంది.
రాజస్థాన్‌లో ఎస్‌డీఎమ్‌గా విధులు నిర్వహిస్తున్న కాజల్ మీనా అనే అధికారి భూవ్యవహారానికి సంబంధించిన కేసు పరిష్కారం కోసం కోసం రూ. లక్ష తొలుత డిమాండ్ చేసింది. అయితే బాధితులు అంత చెల్లించలేము అని అనడంతో రూ. 60 వేలకు డీల్ కుదిరింది. అయితే ఈ వివరాలని బాధితుడు ఏసీబీకి తెలియజేయడంతో పక్కా ప్లాన్ వేసిన అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా ఆమెను పట్టుకున్నారు. అయితే ఆ సమయంలో తన బ్యాగులో మరో రూ. 4 లక్షలున్నాయని వాటిని కూడా స్వాధీనం చేసుకున్నామని అధికారులు పేర్కొన్నారు.
కాజల్ మీనా నేపథ్యం
కాజల్ మీనా 2024లో రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన పరీక్షలలో టాఫర్‌గా నిలిచారు. అంతే కాకుండా హిమాచల్ ప్రదేశ్ ఐఐటీ మండిలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివారు. అయితే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫలితాల్లో టాపర్‌గా నిలిచిన సందర్భంలో ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూ ఇప్పుడు వైరల్‌గా మారింది. అప్పుడు అవినీతిని నిరోధిస్తానని ప్రజా సేవ చేయడమే లక్షమని పేర్కొంది.
కాగా ఇప్పుడు తన తొలి పోస్టింగ్ లోనే లంచం తీసుకుంటూ దొరకడంతో దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. అవినీతిని నిర్మూలిస్తానని ప్రగల్భాలు పలికిన అధికారి తన తొలిపోస్టింగ్‌లోనే ఏసీబీకి చిక్కడమేంటని ప్రశ్నిస్తున్నారు.


