సుల్తాన్‌పూర్/న్యూఢిల్లీ: అత్యవసర సమయాల్లో రహదారులపైనే యుద్ధవిమానాలు దిగేందుకు వీలుగా ఉత్తరప్రదేశ్‌లోని పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై గతంలో నిర్మించిన ఎమర్జెన్సీ రన్‌వేపై భారత వాయుసేన విమానాలు పలుమార్లు ల్యాండింగ్, టేకాఫ్ తీసుకుని తమ యుద్ధ సన్నద్ధతను చాటాయి. దీంతో విమానాలను చూసేందుకు స్థానికులు ఎగబడ్డారు.
జాగ్వార్ యుద్ధ విమానం, సీ–295 సైనిక, సరకు రవాణా విమానం, ఇతర కీలక సైనిక విమానాలు బుధవారం సుల్తాన్‌పూర్ జిల్లాలోని ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ(ఈఎల్‌ఎఫ్)గా పిలిచే ‘అర్వాల్– కిరీ కర్వాత్’రన్‌వే మీద ఆకస్మికంగా దిగుతూ, అంతేవేగంతో టేకాఫ్ తీసుకుంటూ తమ యుద్ధ సన్నద్ధతను నిరూపించాయి.
మిరాజ్–2000, సుఖోయ్–30 ఎంకేఐ విమానాలతోపాటు ఎంఐ–17 వీ5 హెలికాప్టర్లు, గరుడ్ కమెండో బృందాలు సైతం అత్యయక పరిస్థితుల్లో చూపాల్సిన తెగువను ప్రదర్శించాయని ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఒక ప్రకటనలో పేర్కొంది. రెండ్రోజులపాటు ఈ ఎమర్జెన్సీ ల్యాండింగ్, టేకాఫ్‌లను చేపడతారు. విమానాలు దిగుతుండటంతో మే ఒకటోతేదీదాకా ఈ పరిధిలో పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వే మీద వాణిజ్య వాహనాల రాకపోకలను నిలిపేసి దారిమళ్లించారు. రహదారిపై 3.2 కిలోమీటర్ల పొడవైన ఈ రన్‌వేను 2021 నవంబర్‌లో ప్రధాని మోదీ ప్రారంభించారు.


