సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్
కేంద్రం, ఈసీ, రాష్ట్రాలకు కోర్టు నోటీసులు
రాబోయే ఎన్నికల్లో అమలుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలన్న కోర్టు
సాక్షి, న్యూఢిల్లీ: పోలింగ్ కేంద్రాల్లో దొంగ, నకిలీ, డూప్లికేట్ ఓట్ల బెడదను పూర్తిగా అరికట్టే లక్ష్యంతో ఫింగర్, ఐరిస్ బయోమెట్రిక్ వ్యవస్థను అమలుచేయాలని సుప్రీంకోర్టులో న్యాయవాది అశ్వినీకుమార్ ఉపాధ్యాయ్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలుచేశారు. ఓటింగ్ ప్రక్రియలో అత్యంత పారదర్శకతను కోరుతూ దాఖలైన ఈ పిటిషన్‌ను విచారణకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చిల ధర్మాసనం స్వీకరించింది.
ఓటు వేసే ముందు ఓటర్ల వేలిముద్రలు, ఐరిస్, ముఖ గుర్తింపు (బయోమెట్రిక్, ఫేషియల్ రికగ్నిషన్) తనిఖీని తప్పనిసరి చేయాలని, వీటిని అమలుచేసేలా కేంద్రప్రభుత్వం, కేంద్ర ఎన్నికల సంఘాలను ఆదేశించాలని ధర్మాసనాన్ని పిటిషనర్ కోరారు. పిటిషన్ దాఖలు చేసిన బీజేపీ నేత, న్యాయవాది ఉపాధ్యాయ్ సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు.
‘అసెంబ్లీ ఎన్నికల్లో నకిలీ, దొంగ ఓట్లు, ఒకరి బదులు మరొకరు ఓటేయడం, నగదు ప్రలోభాల వంటి ఘటనలు ఎక్కువయ్యాయి. పాత ఓటర్ ఐడీ కార్డులు, వాటిపై సరిగా కన్పించని ముఖాలు, కార్డుల్లో టైపింగ్ తప్పిదాలు, రియల్‌టైమ్‌తో అనుసంధానంకాని పాత సమాచారం వంటి లోపాలు దొంగ, నకిలీ ఓట్ల వ్యవస్థ తిష్టవేయడానికి కారణమవుతున్నాయి. ఫింగర్, ఐరిస్‌తో ఇలాంటివన్నీ ఆగిపోతాయి. పోలింగ్ వ్యవస్థలో లోపాలను అరికట్టేందుకు బయోమెట్రిక్ అనేది అత్యంత అవసరం. ‘ఒక పౌరుడికే ఒకే ఓటు’అనే రాజ్యాంగ స్ఫూర్తిని బయోమెట్రిక్ విధానం కాపాడుతుంది.
ప్రజాప్రాతినిధ్య చట్టం–1950 కింద ఆధార్‌ను ఇప్పటికే సరైన గుర్తింపు కార్డుగా పరిగణిస్తున్నారు. అదే తరహాలో పోలింగ్ బూత్‌లలో బయోమెట్రిక్‌ను అమలుచేయవచ్చు’’అని ఆయన కోర్టులో వాదించారు. ‘‘మార్చి 28న ఈసీకి వినతిపత్రం ఇచ్చినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. వాస్తవానికి రాజ్యాంగంలోని 324 అధికరణం ద్వారా సంక్రమించిన సర్వాధికారాలతో ఈసీ ఇలాంటి అత్యంత పారదర్శకమైన విధానాలను స్వీయనిర్ణాయాధికారాలతో అమలుచేయవచ్చు’’అని ఆయన గుర్తుచేశారు. తర్వాత కోర్టు స్పందించింది.
‘‘బయోమెట్రిక్ తనిఖీల విధానాన్ని పోలింగ్ కేంద్రాల్లో తీసుకురావాలంటే ప్రస్తుత ఎన్నికల నిబంధనల్లో భారీ మార్పులు చేయాల్సి ఉంటుంది. అధునాతన సాంకేతికతను దేశవ్యాప్తంగా అన్ని పోలింగ్ కేంద్రాల్లో అమలుచేయాలంటే కేంద్రప్రభుత్వ ఖజానాపై తీవ్రమైన ఆర్థిక భారం పడుతుంది. ఇప్పుడు జరగబోయే రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఫింగర్, బయోమెట్రిక్ ఐరిస్‌ను అమలుచేయాలని ఆదేశించలేం. ఏర్పాట్లన్నీ అయిపోయిన ఈ దశలో ఇప్పటికిప్పుడు వినూత్న విధానం అమలు అసాధ్యం. తదుపరి సార్వత్రిక ఎన్నికలు లేదా శాసనసభల ఎన్నికల నాటికి ఈ బయోమెట్రిక్ విధానం అమలు సాధ్యాసాధ్యాలపై పరిశీలన చేయాల్సి ఉంది’’అని ధర్మాసనం పేర్కొంది. బయోమెట్రిక్ విధానం అమలుపై మీ స్పందన తెలపాలంటూ కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం, పలు రాష్ట్ర ప్రభుత్వాలకు కోర్టు నోటీసులు జారీ చేసింది.


