పాకిస్తాన్‌కు ఫరూక్ అబ్దుల్లా పిలుపు
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో హింసకు అంతం పలకాలని నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా పాకిస్తాన్‌కు పిలుపునిచ్చారు. ఇప్పటివరకు జరిగిన నష్టం జరిగిందని, ఇకనైనా హింసను ఆపాలని సూచించారు. ‘మేం ఉగ్రవాదాన్ని ఎప్పటికీ ప్రోత్సహించం. భవిష్యత్తులో అలాంటి ఏ యుద్ధంలోనూ భాగం కాబోం. పాకిస్తాన్ ఈ విషయాన్ని గ్రహించిందని ఆశిస్తున్నాను. మేం శాంతిని ప్రేమించే ప్రజలం. శాంతి నెలకొనాలని కోరుకుంటున్నాం.
ఇక చాలు... ఈ హింసకు ముగింపు పలకండి’అని ఫరూక్ అబ్దుల్లా విజ్ఞప్తి చేశారు. అప్పుడే రెండు ప్రాంతాల ప్రజలు గౌరవంగా, హుందాగా జీవించడానికి సాధ్యమవుతుందన్నారు. ఇప్పటికే ఉగ్రవాదం చాలా తగ్గినప్పటికీ, జమ్మూకశ్మీర్‌ను భారత్‌లో అంతర్భాగంగా పాక్ అంగీకరించకపోవడమే నానాటికి హింసను పెంచుతోందని మాజీ ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. గతేడాది పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి ఈ శాంతి పునరుద్ధరణ ప్రయత్నాలకు పెద్ద ఎదురుదెబ్బన్నారు.
ఈ బాధను ఆతీ్మయులను కోల్పోయిన కుటుంబాలు మాత్రమే కాదు, జమ్మూకశ్మీర్ ప్రజలు కూడా అనుభవించారని ఫరూక్ అబ్దుల్లా గుర్తు చేశారు. ఈ దాడికి నిరసనగా స్థానిక ప్రజలు స్వచ్ఛందంగా వీధుల్లోకి రావడం జమ్మూకశ్మీర్ ఉగ్రవాదాన్ని తిరస్కరిస్తుందని చెప్పడానికి సంకేతమని, హింసకు అంతం కావాలని పాకిస్తాన్‌కు కశ్మీర్ లోయ ప్రజలు సందేశం పంపారని చెప్పారు. ఇరు దేశాలు హింసను విడిచి పెట్టి, శాంతిమార్గాన్ని అన్వేషించడానికి సమయం ఆసన్నమైందన్నారు.
భిన్నత్వంలో ఏకత్వమే మన బలం..
దేశంలో పెరిగిన మతతత్వ ధోరణులపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయ అధికారం కోసం మత ప్రాతిపదికన ప్రజలను విభజించే ధోరణి జమ్మూకశ్మీర్‌కే కాదు, యావత్ దేశ స్థిరత్వానికి కూడా ప్రమాదకరమని ఆయన హెచ్చరించారు. జమ్మూకశ్మీర్ నుంచి తమిళనాడు వరకు ప్రాంతాల మధ్య భాష, సంస్కృతిలో అపారమైన వ్యత్యాసాలు ఉన్నాయని, భిన్నత్వంలో ఏకత్వమే దేశ బలమని ఆయన గుర్తు చేశారు. దేశ ప్రజలు ఐక్యంగా ఉంటేనే విశ్వగురువులం అవుతామని, ఒకరికొకరు సాయం చేసుకోవాలనే సామూహిక సంకల్పమే దేశాన్ని కలిపి ఉంచుతుందని ఫరూక్ అబ్దుల్లా నొక్కి చెప్పారు. యుద్ధాలు సమస్యలకు పరిష్కారం కాదని, అవి సమస్యను మరింత పెంచుతాయని అభిప్రాయపడ్డారు. రష్యా–ఉక్రెయిన్, పశి్చమ ఆసియా యుద్ధం వంటి ప్రపంచ సంఘర్షణలు ద్రవ్యోల్బణాన్ని విపరీతంగా పెంచి, పేదరికాన్ని మరింత తీవ్రతరం చేస్తాయని హెచ్చరించారు.


