బెంగాల్లో కాంగ్రెస్ దురవస్థ
50 ఏళ్లుగా అధికారానికి దూరం
నానాటికీ పడిపోతున్న ఓట్ల శాతం
2021లో ఒక్క సీటూ దక్కని వైనం
ఉనికే లక్ష్యంగా ఈసారి ఒంటరి పోరు
సాక్షి, న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల పోరు ప్రధానంగా అధికార తృణమూల్ కాంగ్రెస్, విపక్ష బీజేపీ మధ్యే కేంద్రీకృతమైంది. రాష్ట్రాన్ని 30 ఏళ్ల పాటు అప్రతిహతంగా పాలించిన కాంగ్రెస్ ఇప్పుడు ఉనికి కోసం పోరాడాల్సిన దురవస్థకు చేరింది. 50 ఏళ్లుగా అధికారానికి దూరమైన కుర వృద్ద పార్టీ ఈసారి ఖాతా తెరిచేందుకే కిందా మీదా పడే పరిస్థితికి చేరుకుంది...!
1977 నుంచి మొదలైన పతనం
స్వాతంత్య్రానంతరం నుంచి బెంగాల్‌ను కాంగ్రెస్ 1977 దాకా పాలించింది. బిదాన్ చంద్రరాయ్, ప్రఫుల్ల చంద్రసేన్, అజయ్ ముఖర్జీ, సిద్ధార్థ శంకర్ రే వంటి దిగ్గజ నేతలు ముఖ్యమంత్రులుగా చేశారు. 1977లో రాష్ట్రంలో కాంగ్రెస్ పతనం మొదలైంది. ఆ ఏడాది జ్యోతిబసు నాయకత్వంలోని కమ్యూనిస్టులు రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకున్నారు. కాంగ్రెస్‌తో విభేదించి 1998లో మమతా బెనర్జీ సొంత కుంపటి పెట్టుకోవడంతో బెంగాల్‌లో పార్టీ పరిస్థితి మరింత కునారిల్లుతూ వచ్చింది. అప్పటినుంచీ క్రమంగా ప్రాధాన్యతను కోల్పోయింది.
2011లో బెంగాల్లో తృణమూల్ తొలిసారిగా అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ కాంగ్రెస్ పరిస్థితి మరీ దయనీయంగా మారింది. 2006 అసెంబ్లీ ఎన్నికల్లో 21 సీట్లు సాధించిన కాంగ్రెస్ 2011లో 42, 2016లో 44 సీట్లు నెగ్గింది. కానీ గత ఐదేళ్లలో బెంగాల్లో బీజేపీ పుంజుకోవడంతో కాంగ్రెస్ భారీగా నష్టపోయింది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కటంటే ఒక్క స్థానం కూడా నెగ్గలేకపోయింది! ఓట్ల శాతంలోనూ సింగిల్ డిజిట్‌కు పరిమితమైంది. 2016లో కేవలం 3 అసెంబ్లీ స్థానాలతో సరిపెట్టుకున్న బీజేపీ 2021లో ఏకంగా 77 సీట్లు సాధించి ప్రధాన ప్రతిపక్ష హోదా చేజిక్కించుకుంది.
కార్యాలయాల్లోనూ కన్పించని సందడి
ప్రస్తుతం బెంగాల్‌వ్యాప్తంగా ప్రతి మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో తృణమూల్, బీజేపీ జెండాలతో ఎన్నికల కోలాహలం కనబడుతుంటే కాంగ్రెస్‌లో మాత్రం చడీచప్పుడే లేదు. చాలా జిల్లాల్లో పార్టీ కార్యాలయాలను సైతం తెరిచే పరిస్థితి లేదు! పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో హస్తంజెండా పట్టుకునే కార్యకర్తే కరువైన పరిస్థితి! 2021 అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్ష పార్టీలతో పొత్తు పెట్టుకొంటే అన్ని పార్టీలూ ‘సున్నా’చుట్టాయి. దాంతో కాంగ్రెస్ ఈసారి మొత్తం 294 అసెంబ్లీ స్థానాల్లోనూ ఒంటరిగా పోటీ చేస్తోంది. బెహ్రాంపూర్ నుండి అధిర్ రంజన్ చౌదరి, మాలతీపూర్ నుంచి మౌసమ్ నూర్, సుజాపూర్ నుంచి అబ్దుల్ హన్నన్ తదితరులు బరిలో ఉన్నారు.
పతనానికి కారణాలెన్నో
బెంగాల్‌లో కాంగ్రెస్ పతనానికి అనేక కారణాలున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అధికార పార్టీలకు వ్యతిరేకంగా భారీ ఉద్యమాలు నడపడంలో మూడు దశాబ్దాలుగా పార్టీ విఫలమైంది. తొలుత లెఫ్ట్ ఫ్రంట్‌కు దన్నుగా ఉన్న మధ్య, ఉన్నత తరగతి ఓటర్లు ఆ తర్వాత టీఎంసీ వైపు మళ్లారు. బీజేపీ ఎదుగుదలతో గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ ఓటు బ్యాంకుకు దాదాపుగా గండి పడింది. రాష్ట్రంలో 30 శాతమున్న ముస్లింలు పూర్తిగా తృణమూల్ వైపు వెళ్లారు.


