రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ సింగ్‌హితరాయ్‌లో వేదాంత పవర్ ప్లాంట్‌లో భారీ బాయిలర్ పేలుడు సంభవించి తొమ్మిది మంది మృతి చెందారు. మరో 40 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సక్తి జిల్లాలోని సింగ్‌హితరాయ్ గ్రామం ఉంటుంది.
పేలుడు తర్వాత కార్మికులు సురక్షిత ప్రదేశాలకు పరుగులు తీసే ప‍్రయత్నం చేయడంతో తొక్కిసలాట జరిగినట్లు తెలుస్తోంది . గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. పేలుడు కారణం ఏంటన్న విషయాన్ని అధికారికంగా నిర్ధారించలేదు.
సక్తి జిల్లా ఎస్పీ ప్రఫుల్ ఠాకూర్ మాట్లాడుతూ.. “సక్తి జిల్లా సింగ్‌హితరాయ్ ప్రాంతంలోని వేదాంత పవర్ ప్లాంట్‌లో బాయిలర్ పేలుడులో 9 మంది మృతి చెందారు. గాయపడిన వారిని రాయగఢ్ ఆసుపత్రికి తరలించాం” అని అన్నారు.
సమాచారం అందుకున్న వెంటనే ఎమర్జెన్సీ టీమ్స్, స్థానిక పరిపాలన అధికారులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ ప్రమాదం మధ్యాహ్నం 2 గంటలకు జరిగింది. పేలుడు సమయంలో కార్మికులు ప్లాంట్‌లోపల పని చేస్తున్నారు. అకస్మాత్తుగా జరిగిన పేలుడుతో అక్కడి ప్రాంతం మొత్తం భయాందోళనలు సృష్టించింది.
ప్రాథమిక నివేదికల ప్రకారం బాయిలర్ లోపల ట్యూబ్ పగిలిపోవడం పేలుడుకు కారణంగా ఉండవచ్చని తెలుస్తోంది. పరిస్థితి ప్రస్తుతం నియంత్రణలో ఉందని అధికారులు తెలిపారు. పేలుడుకు సంబంధించి కచ్చిత కారణం తెలుసుకునేందుకు విచారణ చేపట్టనున్నారు.


