బెంగళూరులో కురిసిన అకాల వర్షాలు ఏడుగురిని పొట్టనబెట్టుకున్నాయి. ఈ రోజు బుధవారం కురిసిన భారీ వర్షాలకు ఓ ఆసుపత్రి ప్రహారి గోడ కూలి ముగ్గురు పిల్లలతో సహా ఏడుగురు మృతి చెందారు.
నగరంలో అకస్మాత్తుగా కురిసిన భారీ వర్షాలకు బౌరింగ్ మరియు లేడీ కర్జన్ ఆసుపత్రి ప్రహారి గోడ కూలింది. వర్షం పెద్దఎత్తున కురవడంతో బలమైన గాలులు వీశాయని దీంతో గోడ పక్కన నిల్చున్న ఏడుగురు బాధితులు అక్కడికక్కడే మృతిచెందారని పోలీసులు వెల్లడించారు. మృతులలో అధికంగా అక్కడే వ్యాపారం చేస్తున్న వీధి వ్యాపారులని తెలిపారు.
దీంతో వివరాలు తెలుసుకున్న సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు. స్థానికుల సహాయంతో శిథిలాల నుండి మృతదేహాలను వెలికితీశారు. ఈ ప్రమాదంపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


