బేతంచెర్ల: కనుమకింది కొట్టాల గ్రామ సమీపంలో ప్రసిద్ధి గాంచిన బిల్వసర్గం గుహలు ఉన్నాయి. వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు సందర్శనకు వస్తున్నారు. ఈ గుహల వద్ద నాలుగు సినిమాల షూటింగ్ కూడా జరిగింది. అయితే రహదారిలో అడుగడుగునా గోతులు ఏర్పడ్డాయి. బురదమయంగా మారడంతో ద్విచక్రవాహనదారులు సైతం వెళ్లేందుకు భయపడుతున్నారు. బేతంచెర్ల నుంచి సుమారు 4 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామ రహదారి నిర్మాణానికి గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 2019 ఫిబ్రవరిలో రూ.3.35 కోట్ల నిధులు మంజూరయ్యాయి. 2023లో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పనులు ప్రారంభించింది. రహదారి ఘాట్ రోడ్డుగా ఉండడంతో ముందుగా రక్షణ గోడలు నిర్మించి, రహదారి వెంట కంకర వేశారు. ఎన్నికలు రావడంతో పనులు ఆగిపోయాయి. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా పెండింగ్ పనులు పూర్తి చేయడం లేదు. రహదారి ఛిద్రమై వాహనాలు వెళ్లలేని దుస్థితి దాపురించినా పాలకులు పట్టించుకోవడం లేదు.


