ఆందోళనలో కేసీ ఆయకట్టు రైతులు
● కృష్ణా జలాల ఎత్తిపోతల నిలిపివేత
పగిడ్యాల: ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం కేసీసీ లిఫ్ట్ నుంచి కేసీ కాలువకు శ్రీశైలం బ్యాక్‌వాటర్ కృష్ణా జలాల సరఫరా నిలిపివేయడంతో ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. హొస్పేట్‌లోని తుంగభద్ర డ్యాం గేట్ల మరమ్మతులు చేపట్టిన నేపథ్యంలో కేసీ కాలువకు గత నెలలో నీటి సరఫరా నిలిపివేసిన సంగతి తెలిసిందే. అయితే కేసీ ఆయకట్టు కింద రబీ సీజన్‌లో ఆరుతడి పంటలు సాగు చేసిన రైతులు నీటి విడుదల కొనసాగించాలని పట్టుబట్టారు. వారం రోజుల పాటు రైతులు ఆందోళనలు చేసిన చంద్రబాబు ప్రభుత్వం దిగిరాలేదు. అయితే వైఎస్సార్‌సీపీ రాష్ట్ర యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్త దారా సుధీర్ ఆధ్వర్యంలో ముచ్చుమర్రి ఎత్తిపోతల ముట్టడికి పిలుపునిచ్చారు. దీంతో ఎట్టకేలకు బాబు ప్రభుత్వం దిగి వచ్చి గత నెల 24వ తేదీ నుంచి మల్యాల లిఫ్ట్ నుంచి ఒక మోటార్, ముచ్చుమర్రి ఎత్తిపోతల నుంచి మూడు మోటార్లను రన్ చేసి కృష్ణా జలాలను కేసీ కాలువకు సరఫరా చేశారు. అయితే ఈనెల 13వ తేదీ నుంచి మల్యాల లిఫ్ట్ మోటార్లను నిలిపివేయగా, 15వ తేదీన ముచ్చుమర్రి మోటార్లను పూర్తిగా ఆపేయడంతో కేసీలో నీటి మట్టం అడుగంటిపోయింది. ఈ విషయమై నీటిపారుదల శాఖ ఏఈఈ వీరమ్మను వివరణ కోరగా.. మల్యాల నుంచి ఒక టీఎంసీ, ముచ్చుమర్రి నుంచి ఒక టీఎంసీ నీటిని కేసీ కాలువకు సరఫరా చేశామని, మళ్లీ నీటి సరఫరా పునరుద్ధరణపై ఎటువంటి ఆదేశాలు లేవన్నారు. నీటి సరఫరా నిలిపివేయడంతో 0 నుంచి 150 కి.మీ. వరకు ఉన్న ఆయకట్టు రైతులు ఆందోళనకు గురవుతున్నారు. మార్చి చివరి వరకు కేసీకి నీటి సరఫరా కొనసాగితేనే ప్రస్తుత పంటలు చేతికి వచ్చే అవకాశం ఉంది. లేదంటే రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది.


