కమనీయం.. కల్యాణం
మహానంది: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా మహానందీశుడి దంపతులకు కల్యాణోత్సవాన్ని కనుల పండువగా నిర్వహించారు. ఆదివారం అర్ధరాత్రి తర్వాత మహానందీశ్వరుడికి లింగోద్భవం కాలంలో మహారుద్రాభిషేకం పూర్తయిన అనంతరం స్వామివారి కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. ఈఓ నల్లకాలువ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో వేదపండితులు బ్రహ్మశ్రీ చెండూరి రవిశంకర అవధాని, ఆలయ అర్చకులు, రుత్వికుల బృందం ముందుగా నూతన వధూవరులను అలంకార మండపం నుంచి తీసుకొస్తూ రాజగోపురం ముందు ఎదురుకోళ్లు ఉత్సవం చేపట్టారు. కల్యాణవేదిక వద్ద గణపతి పూజ, పుణ్యాహవాచన, మాంగల్య ధారణ పూజలు శాస్త్రోక్తంగా చేపట్టారు. గుండంపాడు, గుండుపాపల గ్రామానికి చెందిన వారు స్వామి, అమ్మవారి తరఫున పెళ్లిపెద్దలుగా పాల్గొన్నారు. పూజా కార్యక్రమాల్లో ఆర్‌డీఓ విశ్వనాధ్, కళావేదిక నిర్మాణ దాత పోగుల మహేశ్వరరెడ్డి, ఆలయ అధికారులు పాల్గొన్నారు. మహానంది ఎస్‌ఐ రామ్మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు చేపట్టారు.


