అంతా శూన్యం! | - | Sakshi
Sakshi News home page

అంతా శూన్యం!

Jun 11 2026 8:11 AM | Updated on Jun 11 2026 8:11 AM

క్షణికావేశంలో తనువు చాలిస్తున్నారు.. మార్పు గమనించాలి

ఇవీ కారణాలు..

ఒక్క క్షణం..
క్షణికావేశంలో తనువు చాలిస్తున్నారు..

బలవన్మరణాలు పాల్పడుతున్నవారిలో 16 నుంచి 40 ఏళ్ల వారే అధికం

అనాథలుగా మారుతున్న పిల్లలు.. ఆగమవుతున్న బతుకులు

కుటుంబంలో వచ్చే విభేదాలే కారణం అంటున్న నిపుణులు

ఉమ్మడి జిల్లాలో పెరుగుతున్న ఆత్మహత్యలతో ఆందోళన

మహబూబ్‌నగర్‌ క్రైం: క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం ఆ కుటుంబంలో తీరని శోకాన్ని మిగిలిస్తోంది..అంతకు మించి అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లలు.. నమ్ముకున్న వారు అనాథలుగా మారుతున్నారు.. పచ్చని కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితులు వస్తున్నాయి.. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఆత్మహత్య ఘటనలు వరుసగా చోటు చేసుకుంటుండటం.. ఈ సంఖ్య ఏటా పెరుగుతుండటం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల నిత్యం ఏదో ఒకచోట బలవన్మరణాలు చోటుచేసుకుంటున్నాయి. ఎక్కువ మంది మహిళలు చిన్నపాటి విషయానికి మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. కుటుంబంలో వచ్చిన గొడవల కారణంగా భార్యాభర్తలు.. తల్లిదండ్రులు ఇలా ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకోవడంతో వందల సంఖ్యలో పిల్లలు అనాథలుగా మారుతున్నారు. తల్లి ఆత్మహత్య చేసుకున్నా.. తండ్రి బలవన్మరణానికి పాల్పడినా అనాథలుగా మారేది వారి పిల్లలే అన్న చిన్న విషయం గుర్తుకు వస్తే చాలా వరకు ఆత్మహత్యలు ఆలోచనలతోనే ఆగిపోతాయి. 2025 నుంచి ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లాలో 962 మంది బలవన్మరణానికి పాల్పడ్డారు. అందులో అత్యధికంగా మహబూబ్‌నగర్‌ జిల్లాలోనే 332 మంది ఉన్నారు. ఈ ఏడాది ఈ జిల్లాలో ఇప్పటికే 149 మంది ఆత్మహత్యలకు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది.

జిల్లా ఏడాది

2025 2026

మహబూబ్‌నగర్‌ 183 149

నారాయణపేట 101 43

వనపర్తి 130 41

నాగర్‌కర్నూల్‌ 181 67

జో.గద్వాల 43 24

నేను ఈ కోర్సులో రాణించలేకపోతున్నా.. నేను ఎంచుకున్న లక్ష్యంలో ముందుకు వెళ్లలేకపోతున్నా.. నా చదువుకు సరైన న్యాయం చేయలేకపోతున్నా. కుటుంబ సభ్యులు.. తల్లిదండ్రులు ఇకనన్ను తిడతారు. అనే భావన ఏర్పడిన వారు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అయితే అప్పటికప్పుడు కాకుండా ఇలాంటి వారు ముందుగానే బలవన్మరణాలకు సిద్ధమవుతారని అంతకు ముందు కొన్ని లక్షణాలను చెబుతుంటారు. కుటుంబ సభ్యులతో ముభావంగా ఉండటం, ఏదో పరలోకంలో ఉన్నట్లు ఆలోచించడం, చిన్న చిన్న విషయాలకు ఏడ్వడం, నేను లేకపోయినా మీరు బాగుండాలని చెబుతుండటం, తోటి విద్యార్థులతో సన్నిహితంగా మెలగకపోవడం, ఒకరిద్దరితో జీవితం అంతమైతే తర్వాత ఏం జరుగుతుందని చర్చించడం, ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన కలిగినప్పుడే చనిపోవచ్చు. లేదా ఆరు నెలల తర్వాతనైనా అదే మదిలో మెదలవచ్చు. అలాంటి సందర్భాల్లో వారి తీరు మనస్తత్వాలకు విరుద్ధంగా ఉంటుంది. ఎవరితోనూ కలవలేకపోవడం, ఒంటరితనం లక్షణాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. – అనిల్‌రాజ్‌, మానసిక వైద్య నిపుణుడు

ఆత్మహత్య చేసుకోవడం వెనుక ప్రధానంగా మూడు కారణాలు ఉన్నాయి. తీవ్రమైన నిరసన తెలపడం.. అభద్రతాభావం.. తన బాధ వినేవారు ఎవరూ లేరు అనే బాధతో ఆత్మహత్య చేసుకోవడానికి పురిగొల్పుతుంది. ఆత్మహత్య చేసుకుంటున్న వారిలో ఎక్కువగా నడివయస్కులవారే. తన మాట వినేవారు ఉన్నారు అని వారు భావిస్తే ఆత్మహత్య ఆలోచన రాకుండా ఉంటుంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement