‘మెగా జాబ్‌మేళాను సద్వినియోగం చేసుకోవాలి’ | - | Sakshi
Sakshi News home page

‘మెగా జాబ్‌మేళాను సద్వినియోగం చేసుకోవాలి’

Jun 14 2026 10:01 AM | Updated on Jun 14 2026 10:01 AM

ములుగు రూరల్‌: ఈ నెల 17వ తేదీన ఇంచర్ల ఎంఆర్‌ గార్డెన్‌లో నిర్వహిస్తున్న మెగా జాబ్‌మేళాను నిరుద్యోగ యువతి, యువకులు సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ సుధీర్‌ రాంనాథ్‌ కేకన్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామీణ నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో జిల్లా పరిపాలన యంత్రాంగం మెగా జాబ్‌మేళా నిర్వహిస్తుందని వెల్లడించారు. ఈ జాబ్‌ మేళాకు 70 కంపెనీల ప్రతినిధులు హాజరై ఉద్యోగావకాశాలు కల్పించే అవకాశం ఉందని వివరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి సీతక్క హాజరవుతారని తెలిపారు. జాబ్‌మేళా ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. అభ్యర్థులు 7వ తరగతి ఉత్తీర్ణులై, టెన్త్‌, ఇంటర్మీడియట్‌, డిప్లామా, ఐటీఐ, డిగ్రీ చదివిన వారు హాజరుకావాలని సూచించారు. అభ్యర్థులు బయోడేటా, పాస్‌ఫొటోలు, ఆధార్‌కార్డు, విద్యార్హత సర్టిఫికెట్లు తీసుకురావాలని వివరించారు. పూర్తి వివరాలకు సెల్‌ నంబర్‌ 8712670103, 8712267011 లలో సంప్రదించాలని సూచించారు.

సర్పంచ్‌లకు

తొలి వేతనాలు

ఐదు నెలల బకాయిలు ఒకేసారి

చెల్లించనున్న ప్రభుత్వం

ఏటూరునాగారం: సర్పంచులుగా గెలిచిన తర్వాత ప్రభుత్వం మొదటిసారిగా వారి ఖాతాల్లో వేతనాలు జమ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేయడంతో సర్పంచ్‌లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం 5 నెలల 10 రోజుల కాలానికి సంబంధించిన బకాయిలు ఒకేసారి విడుదల చేయనుండడంతో వారి కష్టాలకు కొంత ఊరటనిచ్చినట్లు అయ్యింది. జిల్లాలో 146 మంది తొలి వేతనాలు అందుకోనున్నారు. అయితే జిల్లాలో 171 పంచాయతీలుండగా అందులో మంగపేట మండలంలోని 25 పంచాయతీలకు ఎన్నికలు జరగలేదు. దీంతో మిగతా 146 మందికి నేరుగా వారి వారి ఖాతాల్లో ఒక్కొక్కరికి రూ. 6,500ల చొప్పున జమ చేసేందుకు కావాల్సిన ఖాతాలు, ఆధార్‌, ఇతర పత్రాల వివరాలను ఆన్‌లైన్‌ చేశారు. ఖాతాల్లో నేరుగా గౌరవ వేతనం పడనుంది.

పోడు భూములకు

పట్టాలివ్వాలి

వెంకటాపురం(ఎం): పేదలు సాగుచేసుకుంటున్న పోడు భూములకు పట్టాలివ్వాలని అఖిల భారత రైతు కూలీ సంఘం (ఏఐకేఎంఎస్‌) ఉమ్మడి వరంగల్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి రాచర్ల బాలరాజు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మండల కేంద్రంలో శనివారం నిర్వహించిన ఏఐకేఎంఎస్‌ డివిజన్‌ ప్రథమ మహాసభకు బొమ్మెడ సాంబయ్య అధ్యక్షత వహించగా ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ములుగు, భూపాలపల్లి ప్రాంతాల్లో 40 సంవత్సరాలకు పైగా పేదలు పోడు వ్యవసాయం చేసుకుంటున్నారని తెలిపారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పోడు భూములు సాగు చేసుకోకుండా ఆపేసి సాగుదారులపై అక్రమ కేసులు పెట్టారని పెట్టిందన్నారు. ఇప్పటికై నా కాంగ్రెస్‌ ప్రభుత్వం స్పందించి పోడుభూములకు పట్టాలివ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐఎంఎల్‌ న్యూ డెమోక్రసీ ఉమ్మడి వరంగల్‌ జిల్లా కార్యదర్శి ఎలకంటి రాజేందర్‌ పాల్గొన్నారు. అనంతరం భూపాలపల్లి, ములుగు డివిజన్‌ కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా బొమ్మెడ సాంబయ్య, ప్రధాన కార్యదర్శిగా కుర్రి ఐల య్య, కోశాధికారిగా శ్యామల రమేశ్‌తో పాటు తొమ్మిది మంది సభ్యులను ఎన్నుకున్నారు.

శనిత్రయోదశి..

భక్తులు కిక్కిరిసి..

కాళేశ్వరం: శని త్రయోదశి, మాసశివరాత్రి పురస్కరించుకొని కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయంలో నవగ్రహాల వద్ద శని, శ్రీసుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో కాలసర్ప నివారణ పూజలను శనివారం భక్తులు అధికంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేసి ఆలయంలో బారులుదీరారు. దీంతో నవగ్రహ, కాలసర్ప పూజలు చేసిన భక్తులు స్వామివారి గర్భగుడిలో విశేష అభిషేక పూజలు నిర్వహించారు. నవగ్రహ పూజలు 435, కాలసర్పదోష పూజలు 175, స్వామివారి గర్భగుడిలో అభిషేకాలు 126, ఇతర పూజలు, ప్రసాదాలపై రూ. 4,59,200 ఆదాయం సమకూరిందని ఆలయవర్గాలు తెలిపాయి. దీంతో గోదావరి తీరం, ఆలయంలో భక్తులు కిక్కిరిసారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement