రాజీమార్గమే రాజమార్గం | - | Sakshi
Sakshi News home page

రాజీమార్గమే రాజమార్గం

Jun 14 2026 10:01 AM | Updated on Jun 14 2026 10:01 AM

గోవిందరావుపేట: కోర్టు గడప ఎక్కిన ప్రతీ కేసు వెనుక ఒక కథ ఉంటుంది. కొన్ని కుటుంబాల మధ్య విబేధాలు.. ఆస్తి తగాదాలు.. ఇంకొందరికి ట్రాఫిక్‌ ఉల్లంఘనలు. ఈ తప్పిదాలన్నీ కేసులుగా మారి కోర్టు మెట్లు ఎక్కిన తర్వాత సంవత్సరాల తరబడి కొనసాగుతుంటాయి. ఆ సమయంలో నష్టపోయేది కేవలం డబ్బు మాత్రమే కాదు.. మనశ్శాంతి కూడా. ఇలాంటి పరిస్థితుల్లో రాజీమార్గమే రాజమార్గమని జాతీయ లోక్‌ అదాలత్‌లు నిరూపిస్తున్నాయి. ఒకరిపై ఒకరు కోపం, బాధ, పట్టుదలతో కోర్టుల చుట్టూ తిరుగుతున్న వారిని ఒకే వేదికపైకి తీసుకొచ్చి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తున్నాయి.

20న జాతీయ లోక్‌ అదాలత్‌

జిల్లాలోని 10 మండలాల పరిధిలో గడిచిన మూడేళ్ల కాలంలో నిర్వహించిన లోక్‌ అదాలత్‌లలో మొత్తం 3,562 కేసులు పరిష్కారం అయ్యాయి. అంటే జాతీయ లోక్‌ అదాలత్‌లపై ప్రజల్లో విశ్వాసం క్రమంగా పెరుగుతోంది. అలాగే కేసుల పరిష్కారానికి న్యాయవ్యవస్థతో పాటు పోలీస్‌శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోంది. అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ కక్షిదారులను చైతన్య పరుస్తున్నారు. ఈ మేరకు ఈ నెల 20వ తేదీన జిల్లా కేంద్రంలో జాతీయ లోక్‌ అదాలత్‌ నిర్వహించనున్నారు. రాజీకి అనుకూలమైన కేసులు ఉన్నవారు ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ సమస్యలకు శాశ్వత పరిష్కారం పొందాలని న్యాయ, పోలీసు శాఖ అధికారులు సూచిస్తున్నారు.

ట్రాఫిక్‌ కేసులే అధికం..

మూడేళ్ల కాలంలో కేసులను లోతుగా పరిశీలిస్తే ప్రతీ ఏడాది అత్యధికంగా పరిష్కారమవుతున్నవి మోటారు వెహికల్‌ యాక్ట్‌ (ఎంవి యాక్ట్‌) కేసులేనని తెలుస్తోంది. ట్రాఫిక్‌ నిబంధనల ఉల్లంఘన, వాహన పత్రాల లోపాలు, జరిమానాలకు సంబంధించిన కేసులు పెద్ద సంఖ్యలో లోక్‌ అదాలత్‌ల ద్వారా ముగుస్తున్నాయి. 2024లో 883 ఎంవీ యాక్ట్‌ కేసులు మాత్రమే పరిష్కారమయ్యాయి. 2025లో ఈ సంఖ్య మరింత పెరిగి 978కు చేరింది. ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు సంబంధించిన కేసులు కోర్టుల్లో పెండింగ్‌ కాకుండా వేగంగా ముగియడం వల్ల పోలీస్‌ శాఖ, న్యాయ వ్యవస్థతో ప్రజలకి ప్రయోజనం చేకూరుతోంది.

సద్వినియోగం చేసుకోవాలి..

లోక్‌ అదాలత్‌లు కేసుల పరిష్కారానికే కాదు, మనుషుల మధ్య ఉన్న విబేధాలను తొలగించే వేదికలు. పెండింగ్‌లో ఉండి రాజీకి అనుకూలమైన కేసుల కక్షిదారులు ఈ నెల 20న జరిగే జాతీయ లోక్‌ అదాలత్‌లో రాజీ కుదుర్చుకుని సమస్యలకు శాశ్వత పరిష్కారం పొందాలి. ములుగు ప్రజలు లోక్‌ అదాలత్‌ను సద్వినియోగం చేసుకుని కోర్టు వివాదాల నుంచి విముక్తి పొంది ప్రశాంత జీవితం గడపాలి.

– సుధీర్‌ రాంనాథ్‌ కేకన్‌, ఎస్పీ

లోక్‌ అదాలత్‌లతో

కోర్టు కేసుల పరిష్కారం

మూడేళ్లలో 3,562 పరిష్కారం

ఈ నెల 20న ములుగులో

జాతీయ లోక్‌ అదాలత్‌

సంవత్సరం కేసులు

2024 1,545

2025 1,685

2026(మార్చి 28 వరకు) 332

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement