● పదేళ్ల తర్వాత కన్నెపల్లి ప్రభుత్వ పాఠశాల ప్రారంభం
● పది మంది విద్యార్థుల చేరిక
ఎస్‌ఎస్‌తాడ్వాయి: ఒకప్పుడు విద్యార్థుల సందడితో కళకళలాడిన పాఠశాల.. విద్యార్థుల కొరతతో మూతపడింది. పదేళ్ల తర్వాత తలుపులు తెరుచుకుంది. మండల పరిధిలోని కన్నెపల్లికి చెందిన గ్రామస్తులు తమ పిల్లలను 10 మందిని ప్రభుత్వ పాఠశాలలో శనివారం చేర్పించారు. దీంతో పాఠశాలను జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ రేగ కల్యాణి, సర్పంచ్ కొమరం శైలజ, ఎంఈఓ గడ్డి శ్రీనివాసులు పునఃప్రారంభించారు. ఈ సందర్భంగా రేగ కల్యాణి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలే సమాజ ప్రగతికి పునాదులని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన ఎంతో మంది ఉన్నత స్థాయికి చేరుకున్నారని గుర్తు చేశారు. పాఠశాలకు అవసరమైన ఫర్నీచర్‌ను తమ సొంత ఖర్చులతో అందజేస్తామని కల్యాణి ప్రకటించారు. మంత్రి సీతక్క చొరవతో మరిన్ని మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తానన్నారు. ఎంఈఓ గడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ. గ్రామ ప్రజలు, ఉపాధ్యాయుల సహకారంతోనే మూసివేసిన పాఠశాలను మళ్లీ ప్రారంభించడం సాధ్యమైందన్నారు. ఈ మేరకు ఏటూరునాగారం మండలంలోని శంకరాజుపల్లి పాఠశాలకు చెందిన ఉపాధ్యాయురాలు సరితను కన్నెపల్లి పాఠశాలకు డిప్యూటేషన్‌పై నియమించినట్లు తెలిపారు. సర్పంచ్ శైలజ మాట్లాడుతూ పాఠశాలను పునఃప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలోనే తమ పిల్లలను చేర్పించాలని గ్రామస్తులను కోరారు. ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ హెచ్‌ఎం విద్యాసాగర్, ఉప సర్పంచ్ రంజిత్, ఉపాధ్యాయురాలు సరిత పాల్గొన్నారు.
పుష్కరఘాట్ ఏర్పాటుకు స్థల పరిశీలన
మంగపేట: మండల కేంద్రంలోని దొంగల ఒర్రె వద్ద నూతనంగా ఏర్పాటు చేయనున్న పుష్కరఘాట్ నిర్మాణ ప్రదేశాన్ని ఆర్కెటెక్చర్ నవీన్ (డిజైనింగ్ ప్రైవేటు ఏజెన్సీ) బృందం శనివారం పరిశీలించింది. 2027లో వచ్చే గోదావరి పుష్కరాలకు మండలంలోని మంగపేట, చుంచుపల్లి రెండు ప్రాంతాల్లో పుష్కరఘాట్‌లను నూతనంగా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే ఆయా ప్రాంతాలను పరిశీలించింది. మండల కేంద్రంలోని దొంగలఒర్రె వద్ద నిర్మాణంలో ఉన్న కరకట్ట వద్ద 62 మీటర్ల మేర పుష్కరఘాట్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం రూ.8 కోట్లు మంజూరు చేసింది. ప్రస్తుత పుష్కరఘాట్ నిర్మాణ ప్రాంతంలో గోదావరి కింద నుంచి ఒడ్డుపై వరకు 17 మీటర్ల ఎత్తు ఉండటంతో కనీసం 100 మీటర్ల వెడల్పుతో నిర్మిస్తే సౌకర్యవంతంగా ఉంటుందని.. అందుకు మంజూరైన నిధులు సరిపోవని ఇరిగేషన్ అధికారులు ప్రభుత్వానికి నివేధించినట్లు సమాచారం. దీంతో పుష్కరఘాట్ నిర్మాణ ప్రాంతాన్ని పున పరిశీలించేందుకు ఆర్కెటెక్చర్ నవీన్ బృందం వచ్చినట్లు అధికారులు తెలిపారు. అదేవిధంగా ముందుగా పుష్కరాలను పురస్కరించుకుని మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులను సైతం ఆర్కెటెక్చర్ బృందం పరిశీలించింది. మంగపేట పుష్కరఘాట్ నిర్మాణానికి ప్రభుత్వం టైర్ నంబర్ వన్ కింద రూ.8 కోట్లు ఇప్పటికే మంజూరు చేయగా చుంచుపల్లి వద్ద టైర్ నంబర్ 2 కింద మరో పుష్కరఘాట్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయనున్నట్లు సమాచారం.


