● మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్
ములుగు రూరల్: బీజేపీతోనే దేశాభివృద్ధి సాధ్యమని మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ అన్నారు. ఈ మేరకు శనివారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ 12 ఏళ్ల సుపరిపాలనపై పార్టీ జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. తొలుత ప్రధాని మోదీ 12 ఏళ్ల పరిపాలనలో దేశంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలపై పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి దేశాన్ని పాలిచిన కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఆరోపించారు. ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ అధికారం చేపట్టాక దేశంలో అభివృద్ధి పనులు జోరుగా సాగుతున్నాయని తెలిపారు. నేషనల్ హైవేలు, విమానాశ్రయాలు, బుల్లెట్ ట్రైన్‌లు అందుబాటులోకి తీసుకొచ్చారని వివరించారు. డిజిటల్ పేమెంట్ ద్వారా ప్రపంచంలో భారతదేశాన్ని అగ్రస్థానంలో నిలిపారని వెల్లడించారు. జిల్లాలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు, రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు తీసుకురావడం అభినందనీయమని వివరించారు. అలాగే మోదీ నాల్గోసారి ప్రధానమంత్రిగా ఎన్నిక కావడం ఖాయమన్నారు. రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వచ్చే విధంగా నాయకులు, కార్యకర్తలు కృషిచేయాలని సూచించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భూక్య జవహర్‌లాల్, అజ్మీర కృష్ణవేణి, భూక్య రాజునాయక్, కృష్ణాకర్, అల్లె శోభన్, విశ్వనాధ్, రాజ్‌కుమార్, సునీల్‌కుమార్, రవిరెడ్డి, యాదగిరి, వెంకటేశ్వర్లు, ఇమ్మడి రాకేశ్ పాల్గొన్నారు.


