జనగామ: రక్తం దొరకక మామ చనిపోయారు. ఆ కారణంగా మరెవరూ చనిపోవద్దని నిర్ణయించుకున్నారు జనగామ పట్టణానికి చెందిన రక్తదాత మల్లిగారి రాజు. 1997 సంక్రాంతి రోజున రైలు ప్రమాదంలో గాయపడిన తన మేనమామ సకాలంలో రక్తం అందక కన్నుమూశారు. ఆ బాధే రాజును రక్తదాతగా మార్చింది. అప్పటి నుంచి నేటి వరకు క్రమం తప్పకుండా ఏడాదికి నాలుగుసార్లు రక్తదానం చేస్తూ వస్తున్నారు. ఇప్పటి వరకు 99 సార్లు రక్తదానం చేసి ఎందరో ప్రాణాలు నిలబెట్టారు. ఒకసారి తన క్లాస్‌మేట్ అక్కకు ఆపరేషన్ సమయంలో అత్యవసరంగా రక్తం అవసరమైతే, రైలెక్కి సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి వెళ్లి రక్తదానం చేశారు. ఆమె ప్రాణాలు కాపాడిన ఘటనను తాను మాటల్లో వర్ణించలేనని గుర్తు చేశారు రాజు. ఆయన సేవలను గుర్తించి జూన్ 2న స్వచ్ఛంద సంస్థలు అవార్డులు, ప్రశంసపత్రాలతో సన్మానించాయి.


