భారతీయ ఇతిహాసం ‘రామాయణం’ ఆధారంగా చాలా సినిమాలు ఇప్పటికే అలరించాయి. ఈ క్రమంలో హిందీలో ‘రామాయణ’ చిత్రాన్ని నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయిపల్లవి, లక్ష్మణుడిగా రవి దుబే, హనుమంతుడిగా సన్నీ డియోల్, రావణుడిగా యశ్ నటిస్తున్నారు. అయితే, ఇటీవల ఈ మూవీ నుంచి విడుదలైన టీజర్ ప్రేక్షకులను మెప్పిస్తుంది. తాజాగా ఈ మూవీ గురించి రణ్‌బీర్ ఒక ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. ఇందులో తను ద్విపాత్రాభినయం చేసినట్లు పేర్కొన్నారు. ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, డీఎన్‌ఈజీ సంస్థ, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ పతాకాలపై భారీ బడ్జెట్‌తో నమిత్ మల్హోత్రా ఈ సినిమాను రెండు భాగాలుగా నిర్మిస్తున్నారు.
ఒక వేదికపై రణ్‌బీర్ మాట్లాడుతూ రామాయణ చిత్రంలో శ్రీరాముడి పాత్రతో పాటు పరశురాముడిగా కూడా నటిస్తున్నట్లు ప్రకటించారు. శ్రీ మహావిష్ణువు ఆరో అవతారం పరశురాముడిగా కూడా నటించే ఛాన్స్ తనకు రావడం నిజంగానే అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఒక నటుడిగా, హావభావాలతో పాటు ఆ పాత్రల వెనుక దాగిన ఆధ్యాత్మికతను, భావోద్వేగాలను లోతుగా అర్థం చేసుకున్నానని తెలిపారు. రామాయణం గురించి పూర్తిగా తెలుసుకునేందుకు సుమారు ఏడాది పాటు సమయం కేటాయించానని ఆయన అన్నారు.


