‘‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ మూవీకి నాగశౌర్య మా ఫస్ట్ చాయిస్. ఆయన కథ వినగానే ఓకే అన్నారు. ఔట్ అండ్ ఔట్ యాక్షన్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాలో తన నటనతో శౌర్యగారు అందర్నీ సర్‌ప్రైజ్ చేస్తారు. తొలి 15 నిమిషాల నుంచి చివరి వరకు ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తారు’’ అని నిర్మాత శ్రీనివాసరావు చింతలపూడి తెలిపారు. నాగశౌర్య, విధి జోడీగా రామ్ దేశినా (రమేష్) దర్శకత్వం వహించిన చిత్రం ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’. శ్రీ వైష్ణవి ఫిల్మ్స్‌పై శ్రీనివాసరావు చింతలపూడి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 17న విడుదల కానుంది.
ఈ సందర్భంగా శ్రీనివాసరావు చింతలపూడి విలేకరులతో మాట్లాడుతూ–‘‘ఆది సాయికుమార్ నటించిన ‘శశి’ సినిమాకు ఒక భాగస్వామిగా చేశాను. సోలో నిర్మాతగా ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ నా తొలి సినిమా. నాగశౌర్యని ఇప్పటివరకు లవర్ బాయ్‌గా చూశారు. ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’లో మాత్రం పూర్తి యాక్షన్‌తో చూస్తారు. ఇంటర్వెల్ బ్యాంగ్ మరో స్థాయిలో ఉంటుంది. కదిరి నరసింహస్వామి బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా ఉంటుంది.
రసూల్‌గారి విజువల్స్, హ్యారిస్ జయరాజ్‌గారి సంగీతం మా మూవీకి ప్లస్. దాదాపు 400లకు పైగా స్క్రీన్లలో మా సినిమాను గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నాం. తెలుగుతో పాటు కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఒడిశాలో కూడా రిలీజ్ చేస్తున్నాం. మా బ్యానర్‌లో జూన్‌లో ఒక సినిమా స్టార్ట్ కాబోతోంది. అలాగే ఇంకో సినిమా ప్రకటన కూడా ఉంటుంది’’ అని చెప్పారు.


