ఏం చేద్దాం..? | - | Sakshi
Sakshi News home page

ఏం చేద్దాం..?

Jun 14 2026 10:01 AM | Updated on Jun 14 2026 10:01 AM

● పైలెట్‌ ప్రాజెక్టు కింద షాద్‌నగర్‌లో రీ సర్వే పూర్తి ● ఎల్‌పీఎంలు, కో రిలేషన్‌ స్టేట్‌మెంట్లు, గూగుల్‌ ఇమేజ్‌ నక్షాలు సిద్ధం ● రికార్డులు అప్పగించి మూడు నెలలైనా తేలని నిర్ణయం ● ప్రభుత్వ నిర్ణయం కోసం వేచి చూస్తున్న అధికారులు రాష్ట్రంలో ఐదు గ్రామాలు

భూముల రీ సర్వే రికార్డుల అమలుపై లోతైన పరిశీలన
● పైలెట్‌ ప్రాజెక్టు కింద షాద్‌నగర్‌లో రీ సర్వే పూర్తి ● ఎల్‌పీఎంలు, కో రిలేషన్‌ స్టేట్‌మెంట్లు, గూగుల్‌ ఇమేజ్‌ నక్షాలు సిద్ధం ● రికార్డులు అప్పగించి మూడు నెలలైనా తేలని నిర్ణయం ● ప్రభుత్వ నిర్ణయం కోసం వేచి చూస్తున్న అధికారులు

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: భూముల రీ సర్వేలో భాగంగా పైలెట్‌ ప్రాజెక్టు వట్‌పల్లి మండలం షాద్‌నగర్‌లో చేపట్టిన రీ సర్వే విధానాన్ని అమలు చేసే అంశంపై రెవెన్యూశాఖ ఎటూ తేల్చడం లేదు. ఈ ప్రక్రియ పూర్తయి మూడు నెలలు గడుస్తున్నా దీని అమలుపై ఎలాంటి నిర్ణయానికి రాలేకపోతోంది. సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డులు, రెవెన్యూ శాఖల అధికారులు ఈ గ్రామ పరిధిలో ఉన్న 593 ఎకరాల భూమిని రీ సర్వే పూర్తి చేశారు. శాటిలైట్‌ ఇమేజ్‌లు, డ్రోన్‌లు వంటి ఆధునిక సాంకేతికతను వినియోగించి అక్షాంశాలు, రేఖాంశాలతో కూడిన ల్యాండ్‌ పార్సిల్‌ మ్యాపు (ఎల్‌పీఎం)లు తయారు చేశారు. ఆయా భూములకు సంబంధించి పాత సర్వే నంబర్లు, కొత్త సర్వే నంబర్లకు సంబంధించిన కోరిలేషన్‌ స్టేట్‌మెంట్లను కూడా సిద్ధం చేశారు. గూగుల్‌ ఇమేజ్‌తో కూడిన నక్షాలు.. ఇలా అన్ని రకాల రికార్డులు తయారు చేసి రెవెన్యూశాఖకు అప్పగించారు. ఈ రికార్డులను భూభారతి పోర్టల్‌లో నమోదు చేసి అమలు చేయాల్సి ఉంటుంది. ఈ అంశంపై ప్రభుత్వం నుంచి మూడు నెలలుగా ఎలాంటి ఆదేశాలు రాలేదు. దీంతో దాదాపు సర్కార్‌ నిర్ణయం కోసం అధికారులు వేచి చూస్తున్నారు. అయితే ఈ రీ సర్వే రికార్డులను అమలు చేస్తే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయనే అంశంపై రెవెన్యూశాఖ లోతైన పరిశీలన చేస్తోందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. దీన్ని రైతుల నుంచి స్పందన ఎలా ఉంటుందనే దానిపై ఆరా తీస్తున్నారు.

భూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం భూభారతి పోర్టల్‌ను తెచ్చిన విషయం విదితమే. రైతులకు పారదర్శకమైన సేవలు అందించడమే లక్ష్యంగా ధరణి స్థానంలో భూభారతి పోర్టల్‌ను తీసుకొచ్చింది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఐదు గ్రామాలను ఎంపిక చేసి భూముల రీ సర్వే చేసింది. సంగారెడ్డి జిల్లాలోని షాద్‌నగర్‌తో పాటు, కోస్గి (నారాయణపేట జిల్లా), ఆమనగల్లు (రంగారెడ్డి), కూసుమంచి (ఖమ్మం), భద్రాద్రి–కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలాల్లోని ఒక్కో గ్రామం చొప్పున ఎంపిక చేసింది. సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డుల శాఖ అధికారులు, సిబ్బంది, రెవెన్యూ అధికారులు కలిసి గ్రామంలోని భూములన్నింటినీ రీ సర్వే చేశారు.

రైతుల నుంచి అభిప్రాయం

రీ సర్వే సంబంధించి గ్రామంలో పట్టాదారుల అభిప్రాయాలు కూడా తీసుకున్నారు. ఏమైనా అభ్యంతరాలుంటే తెలపాలని అధికారులు కోరారు. కొందరు రైతులు ఈ రీ సర్వేపై అభ్యంతరాలు తెలిపారు. ఈ అభ్యంతరాలను నివృత్తి చేశామని అధికారులు పేర్కొంటున్నారు. ఈ ప్రక్రియ అంతా పూర్తయి మూడు నెలలు గడుస్తున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి నిర్ణయం రాలేదు. ప్రభుత్వ నిర్ణయం కోసం వేచి చూస్తున్నామని రెవెన్యూ అధికారులు పేర్కొంటున్నా రు. కాగా.. రీ సర్వేకు సంబంధించి రికార్డులు ఏప్రిల్‌ 2 నుంచే అమలులోకి వస్తాయని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, ఇంకా అమలు విషయంలో ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement