రీజినల్ మేనేజర్ విజయ్ భాస్కర్
సంగారెడ్డి టౌన్: త్వరలో ఆర్టీసీలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు రీజినల్ మేనేజర్ విజయ్ భాస్కర్ తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. యూనియన్ల పునరుద్ధరణ, ఆర్టీసీ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేసే అంశంపై నిర్ణయం తీసుకున్నామని, దీనికి సంబంధించి ఒక కమిటీని ఏర్పాటు చేశారన్నారు. అన్ని డిపోలలో కార్మిక శాఖ పర్యవేక్షణలో అత్యంత పారదర్శక పద్ధతిలో యూనియన్ వెరిఫికేషన్ ప్రక్రియను నిర్వహించడానికి తగిన చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. కమిటీ ఇప్పటికే ప్రత్యేకంగా సమావేశమై సంబంధించిన అన్ని సాంకేతిక ,ఆర్థిక పరిపాలనపరమైన అంశాలపై లోతైన సమీక్ష నిర్వహిస్తుందని చెప్పారు. కార్యక్రమంలో డిప్యూటీ రీజినల్ మేనేజర్ మధుసూదన్ పాల్గొన్నారు.
వర్షాల వేళ.. జాగ్రత్త
రామాయంపేట(మెదక్): ఇటీవల బాధ్యతలు చేపట్టిన మున్సిపల్ కమిషనర్ రవీందర్ పట్టణంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన శనివారం కౌన్సిలర్ శంకర్‌గౌడ్‌తో కలిసి ఎనిమిదో వార్డులో పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పాక్షికంగా శిథిలమైన మురుగు కాలువలు, రహదారులను పరిశీలించారు. శిథిలావస్థలో ఉన్న గృహాలను పరిశీలించి, వాటిని తొలగించడానికి త్వరలో నోటీసులు జారీ చేస్తామన్నారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో పట్టణ ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. మురుగు కాలువల్లో చెత్త వేయవద్దని సూచించారు. వార్డులో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఇంజనీరింగ్, వార్డు అధికారులను ఆదేశించారు.
అంజన్న సన్నిధిలో
భక్తజన సందడి
శివ్వంపేట(నర్సాపూర్): చాకరిమెట్ల సహకార ఆంజనేయస్వామి ఆలయంలో శనివారం భక్తజన సందడి నెలకొంది. వేసవి సెలవులు ముగుస్తుండటంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దంపతులు అభిషేకం అనంతరం సత్యనారాయణస్వామి మండపంలో సామూహిక వ్రతాలు ఆచరించారు. మండల పరిధిలోని ఉసిరికపల్లికి చెందిన బీఆర్‌ఎస్ నాయకుడు కృష్ణారావు భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఆలయం వద్ద నిర్వహిస్తున్న నిత్య అన్నదానానికి భక్తులు వస్తు, ధన రూపంలో సహాయం అందించాలని ఈఓ శ్రీనివాస్, ఆలయ చైర్మన్ ఆంజనేయశర్మ కోరారు.
చెట్లు తెంచిన తంటా
పవర్ వర్సెస్ ఫారెస్ట్‌శాఖ
హవేళిఘణాపూర్(మెదక్): చెట్ల కొమ్మలను తొలగించే విషయం విద్యుత్, అటవీశాఖ అధికారుల మధ్య ఘర్షణకు దారి తీసింది. మండల పరిధిలోని జక్కన్నపేట– బూర్గుపల్లికి సరఫరా అయ్యే విద్యుత్ తీగలకు అడ్డుగా ఉన్న చెట్లను శనివారం విద్యుత్‌శాఖ అధికారులు నరికివేస్తుండగా, తమ అనుమతి లేకుండా ఎలా తొలగిస్తారంటూ అటవీశాఖ అధికారులు వచ్చి అడ్డుకున్నారు. దీంతో ఇరువురి మధ్య మాటామాటా పెరిగి తోపులాటకు దారి తీసింది. దీనిపై ఇరువురు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
415 కేంద్రాల్లో
కొనుగోళ్లు పూర్తి
మెదక్ కలెక్టరేట్: జిల్లాలో ఇప్పటివరకు 415 కేంద్రాల్లో కొనుగోళ్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ ప్రతిమాసింగ్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 90,669 రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేశామన్నారు. 73,429 మంది రైతుల ఖాతాల్లో రూ.786 కోట్లు జమ చేసినట్లు చెప్పారు.


