సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ఉమ్మడి మెదక్ జిల్లాలో శనివారం పలు చోట్ల భారీ వర్షం కురిసింది. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండల కేంద్రంలో రాష్ట్రంలోనే అత్యధికంగా 11.4 సెం.మీల వర్షపాతం రికార్డు అయింది. దీంతో వాతావరణశాఖ జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. శనివారం ఉదయం 8 గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ఉమ్మడి జిల్లాలో వివిధ చోట్ల నమోదైన వర్షపాతం వివరాలను పరిశీలిస్తే.. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం దామరంచలో 4.7 సెం.మీలు, పుల్కల్ 3.4 సెం.మీలు, మునిపల్లిలో 3.2 సెం.మీలు, రామచంద్రాపూరం బీహెచ్‌ఈఎల్‌లో 3.0 సెం.మీలు, సదాశివపేటలో 2.3 సెం.మీలు, రాయికోడ్, న్యాల్‌కల్ మండలాల్లో 1.5 సెం.మీల చొప్పున వర్షపాతం రికార్డు అయింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా దాదాపు అన్ని మండలాల్లో వర్షపాతం రికార్డు అయింది. ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడింది. భారీ వర్షాలకు పలుచోట్లు ధాన్యం తడిపోయింది. చెట్లు విరిగి రోడ్లపై పడటంతో వాహనదారులు ఇబ్బందిపడ్డారు. పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
నేలవాలిన వృక్షాలు
రామాయంపేట(మెదక్)/పెద్దశంకరంపేట: మండలంలోని తొనిగండ్లలో శనివారం కురిసిన భారీ వర్షం కురిసింది. భారీ వృక్షాలు నేలవాలాయి. విద్యుత్ తీగులు తెగిపోయాయి. ఇద్దరి ఇళ్లపైన ఉన్న రేకులు ఎగిరిపోయాయి. సర్పంచ్ శివుకుమారి పాలకవర్గంతో కలిసి గ్రామంలో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. రోడ్డుకు అడ్డంగా పడిపోయిన చెట్లను తొలగింపజేశారు. అలాగే పెద్దశంకరంపేట మండలంలోని పలు గ్రామాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. పలువురి ఇళ్ల రేకులు గాలివానకు ఎగిరిపోయాయి. ఉత్తులూర్ వద్ద రహదారిపై చెట్టు కూలిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
రహదారిపై కూలిన చెట్టు
ఉత్తులూర్‌లో గోడపై పడిన చెట్టు
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా
పలు మండలాల్లో వాన
కొండాపూర్‌లో కుండపోత
రాష్ట్రంలోనే అత్యధికంగా
11.4 సెం.మీ రికార్డు
పలుచోట్ల తడిసిన ధాన్యం


