సర్పంచ్‌లకు వేతనాలు | - | Sakshi
Sakshi News home page

సర్పంచ్‌లకు వేతనాలు

Jun 14 2026 10:01 AM | Updated on Jun 14 2026 10:01 AM

జిల్లాకు రూ. 1.61 కోట్లు విడుదల

నేరుగా వారి ఖాతాల్లో జమ

రామాయంపేట(మెదక్‌): ఐదు నెలలుగా వేతనాల కోసం ఎదురుచూస్తున్న సర్పంచ్‌లకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారు ఎన్నికల్లో గెలుపొందినప్పటి నుంచి ఇప్పటివరకు గౌరవ వేతనాలు విడుదల కాలేదు. ఈక్రమంలో తాజాగా ప్రభుత్వం రూ.1.61 కోట్లు విడుదల చేసింది. జిల్లాలోని 492 మంది సర్పంచ్‌లకు మంజూరైన వేతనాలు నేరుగా వారి ఖాతాల్లో జమ చేసింది. వీరిలో తొమ్మిది మంది ఇతర సంస్థల నుంచి వేతనాలు పొందుతుండటంతో వారి ఖాతాల్లో డబ్బులు పడినా, అధికారులు హోల్డ్‌లో పెట్టారు. సదరు సర్పంచ్‌లు క్లియర్‌ చేసుకొని లేఖ అందజేస్తే వారి ఖాతాల్లో సైతం డబ్బులు జమవుతాయని తెలిపారు. ఈ మేరకు జిల్లాలోని సర్పంచ్‌లు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

గత డిసెంబర్‌లో ఎన్నికలు

రెండేళ్లకు పైగా ప్రత్యేకాధికారుల పాలనలో ఉన్న పంచాయతీలకు గతేడాది డిసెంబర్‌లో ఎన్నికలు జరిగి, నూతన పాలకవర్గాలు కొలువుదీరాయి. గెలిచి ఆరు నెలలు కావొస్తున్నా వారికి నెలవారీగా ఇచ్చే గౌరవ వేతనం కోసం సర్పంచ్‌లు ఎంతగానో ఎదురు చూశారు. ఎట్టకేలకు ప్రభుత్వం వారి నిధులు విడుదల చేసింది. ఐదు నెలల పది రోజులకు సంబంధించిన డబ్బులను వారి వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది.

ప్రతినెలా అందించాలని వినతి

సర్పంచ్‌లకు వేతనాలు చెల్లించడంలో కొంత ఆలస్యమవుతోంది. వీరికి ప్రతి నెలా ఒకటో తేదీన విడుదలయ్యేలా చూడాలని గత పాలకవర్గాలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. ఆరు నెలలు, ఏడాదికోసారి గౌరవ వేతనాలను ప్రభుత్వం విడుదల చేస్తోంది. దీంతో కొందరు సర్పంచ్‌లు ఇబ్బందులు పడుతున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement