మల్లన్నా.. పాలన ఏదీ? | - | Sakshi
Sakshi News home page

మల్లన్నా.. పాలన ఏదీ?

Jun 12 2026 7:19 AM | Updated on Jun 12 2026 7:19 AM

తరచూ ఈఓల మార్పు

ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి దేవాలయంలో పరిపాలన గందరగోళంగా మారుతోంది. ఆలయ అభివృద్ధికి నిర్ణయాలు తీసుకోవాల్సిన కార్యనిర్వహణాధికారులు (ఈఓ) తరచూ మారుతుండటం, పైగా ఇన్‌చార్జులుగా వ్యవహరిస్తుండటమే ఇందుకు కారణం. ఏడాదిన్నరలోనే నలుగురు ఈఓలు మారడం ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. మరోవైపు ఆలయ పరిపాలనపై దేవాదాయ శాఖ సైతం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

–సాక్షి, సిద్దిపేట

కొమురవెల్లి మల్లికార్జున స్వామి దేవాలయానికి పూర్తిస్థాయి కార్యనిర్వహణాధికారి లేకపోవడంతో పర్యవేక్షణ కరువవుతోంది. 1967 నుంచి ఇప్పటి వరకు 70 ఈఓలు కొనసాగగా అందులో 25 మంది ఇన్‌చార్జులుగా వ్యవహరించారు. ఇన్‌చార్జి కావడంతో వారంలో కేవలం రెండు నుంచి మూడు రోజులు మాత్రమే సమయం కేటాయిస్తున్నారు. దీంతో దేవాలయంలో జరిగే అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతున్నాయి. అలాగే దేవాలయ బ్రహ్మోత్సవాలలో భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో విఫలమవుతున్నారు. దర్శనం పాస్‌లు సైతం విక్రయిస్తుండటం గమనార్హం.

పదవీ విరమణలు ఇక్కడే..

కొమురవెల్లిలో ఇన్‌చార్జి ఈఓగా విధులు నిర్వర్తించిన బాలాజీ డిసెంబర్‌ 31, 2024న పదవీ విరమణ చేశారు. ఆ తర్వాత అన్నపూర్ణ ఇన్‌చార్జి ఈఓగా పని చేస్తూ ఆగస్టు 31, 2025న పదవీ విరమణ పొందారు. వెంకటేశ్‌ సైతం ఫిబ్రవరి 28, 2026న పదవీ విరమణ ఇక్కడే చేశారు. ఇలా పదవీ విరమణ పొందే వారిని ఈఓలుగా, ఇన్‌చార్జి ఈఓలుగా నియమిస్తున్నారు. ఏడాదిన్నరలోనే నలుగురు ఈఓలు మారగా ఐదో ఈఓ సైతం ఇన్‌చార్జినే నియమించారు. ప్రస్తుతం పని చేస్తున్న సుధాకర్‌రెడ్డి రెగ్యులర్‌ ఈఓ కీసర గుట్టలో పని చేస్తూ కొమురవెల్లి మల్లికార్జున స్వామి దేవాలయం ఈఓగా అదనపు బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. ఇలా ఇన్‌చార్జిలు రెండు నుంచి నాలుగు నెలల పాటు చేయడంతో పూర్తి స్థాయిలో అవగాహన రావడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు.

దృష్టిసారించని ఇన్‌చార్జులు

అభివృద్ధి పనులపై కొరవడిన పర్యవేక్షణ

కనీస సౌకర్యాలు సైతం కరువు

వేలాది మంది భక్తులకు తప్పని తిప్పలు

పూర్తి స్థాయి ఈఓలు లేకపోవడంతో అభివృద్ధి పనులపై దృష్టి సారించడం లేదు. ఎనిమిదేళ్ల క్రితం బండ్ల గుట్టపై 50 గదుల నిర్మాణం చేపట్టారు. అది ఇప్పటి వరకూ పూర్తి కాలేదు. దేవాదాయ శాఖ అధికారులు సైతం ఎవరూ పట్టించుకోకపోవడంతో కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఎవరైనా పూర్తి స్థాయిలో అధికారి ఉండి పర్యవేక్షిస్తే ఎప్పుడో పూర్తి అయ్యేదని భక్తులు అభిప్రాయ పడుతున్నారు. గదుల కొరతతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే దేవాలయానికి సమీపంలో దాసరి గుట్టపైన కాటేజీల నిర్మాణం కోసం రూ.6కోట్ల వ్యయంతో రోడ్డు నిర్మాణం పనులు చేపట్టారు. ఆ పనులు సైతం అర్ధంతరంగా నిలిచిపోయాయి. క్యూ కాంప్లెక్స్‌ పనులు సైతం పూర్తి కాలేదు. అదే విధంగా ఆలయంలో పనిచేసే ఉద్యోగులపై సరైన మానిటరింగ్‌ లేకపోవడంతో సక్రమంగా విధులు నిర్వర్తించడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికై నా దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ఉన్నత అధికారులు స్పందించి పూర్తి స్థాయి ఈఓను నియమించి దేవాలయ అభివృద్ధికి కృషి చేయాలని భక్తులు కోరుతున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement