తుది దశకు
● 332 కేంద్రాలు మూసివేత
● రైతులకు రూ.725 కోట్ల చెల్లింపులు
● నాలుగు రోజుల్లో పూర్తి కానున్న ప్రక్రియ
ఇప్పటివరకు 3.89 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ
జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోళ్లు చివరి దశకు చేరుకున్నాయి. ఇప్పటివరకు 3.89 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు సేకరించగా, మరో 15 వేల మెట్రిక్ టన్నులు వచ్చే అవకాశం ఉంది. 533 కొనుగోలు కేంద్రాలకు గానూ, 332 సెంటర్లను మూసివేశారు. మరో నాలుగు రోజుల్లో ధాన్యం సేకరణ పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు.
– మెదక్‌జోన్
జిల్లావ్యాప్తంగా యాసంగిలో 2.75 లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. అందులో 40 వేల ఎకరాల్లో సన్నాలు సాగు చేయగా, మిగితా 2.35 లక్షల ఎకరాల్లో దొడ్డు రకం వడ్లు పండించారు. 3.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని అంచనా వేసిన అధికారులు, 533 సెంటర్లు ఏర్పాటు చేశారు. ఏప్రిల్ రెండో వారం నుంచి కొనుగోళ్లు ప్రారంభించారు. 100 కేంద్రాల ద్వారా సన్న ధాన్యం, మరో 433 సెంటర్ల నుంచి డొడ్డు రకం వడ్లు కొనుగోలు చేశారు. ఇప్పటివరకు 86,672 మంది రైతుల నుంచి 3,89,364 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు. మరో 15 వేల మెట్రిక్ టన్నులు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. కాగా, జిల్లాలో ఇప్పటివరకు 332 కేంద్రాల్లో కాంటాలు పూర్తి కాగా వాటిని మూసి వేశారు. మరో 201 సెంటర్లలో కొనుగోళ్లు సాగుతున్నాయి. అవి కూడా నాలుగైదు రోజుల్లో పూర్తయ్యే అవకాశం ఉంది. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి రైతులకు రూ.925 కోట్లు చెల్లించాల్సి ఉండగా, ఇప్పటివరకు రూ.725 కోట్లు వారి ఖాతాల్లో జమ చేశారు. ఈ లెక్కన ఇంకా రూ. 200 కోట్లు చెల్లించాల్సి ఉంది. యాసంగి సీజన్‌లో 3.50 లక్షల మెట్రిక్ టన్నులు సేకరిస్తామని అధికారులు ముందుగా ప్రకటించారు. కానీ వారి అంచనా తారుమారై 4 లక్షల మెట్రిక్ టన్నులు దాటే అవకాశం ఉంది.
సన్నాలకు నో బోనస్
జిల్లాలో ఈసారి 38 వేల మెట్రిక్ టన్నుల సన్న ధాన్యం రైతులు పండించారు. మద్దతు ధర రూ. 2,389 చెల్లిస్తున్నారు. ప్రభుత్వం సన్నాలకు సంబంధించి క్వింటాల్‌కు రూ. 500 బోనస్ ఊసే ఎత్తడం లేదు. అంతేకాకుండా 2024 యాసంగిలో 62,742 మెట్రిక్ టన్నుల సన్న ధాన్యానికి సంబంధించి సైతం బోనస్ డబ్బులు ఇప్పటివరకు రైతులకు చెల్లించలేదు. వానాకాలానికి సంబంధించి మాత్రమే సన్నాలకు బోనస్ చెల్లించి యాసంగిలో చెల్లించటం లేదని రైతులు వాపోతున్నారు.


