● నగరంలోని లోతట్టు ప్రాంతాల్లో
రోడ్లపైకి మురుగు
● విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయం
మహబూబ్‌నగర్ (వ్యవసాయం)/ మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: పాలమూరు నగరంలో ఆదివారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. నగర పరిధిలోని లోతట్టు ప్రాంతాలైన గణేష్‌నగర్, రామయ్యబౌలి, శివశక్తినగర్, గచ్చిబౌలి, బీకేరెడ్డి కాలనీ, కుర్హినిశెట్టికాలనీ, కిసాన్‌నగర్, లక్ష్మీనగర్, వెంకటేశ్వరకాలనీ తదితర ప్రాంతాల్లో డ్రెయినేజీలు పొంగిపొర్లాయి. ముఖ్యంగా గల్లీ రోడ్లపైకి మురుగుతోపాటు వర్షపు నీరు ఏరులై పారింది. దీంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అలాగే 12 విలీన గ్రామాల్లోని మట్టి రోడ్లు బురదమయంగా మారి అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి నెలకొంది. కొద్దిసేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడటంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లపాలయ్యారు.
ఊరటనిచ్చిన వానలు
ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో జిల్లావ్యాప్తంగా ఆదివారం మోస్తరు వర్షం కురిసింది. శనివారం అర్ధరాత్రి తర్వాత ప్రారంభమైన వర్షం ఆదివారం ఉదయం 15.3 మి.మీ., నమోదైంది. సాయంత్రం పలు మండలాల్లో కొనసాగింది. దీంతో ఎండల తీవ్రత తగ్గి ప్రజలు ఉపశమనం పొందారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో సాగుకు అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయి. జిల్లా అధికారుల గణాంకాల ప్రకారం ఆదివారం జిల్లాలో సగటున 15.3 మి.మీ., వర్షపాతం నమోదైంది. అత్యధికంగా బాలానగర్ మండలంలో 36.8 మి.మీ., అత్యల్పంగా హన్వాడలో 5.8 మి.మీ., వర్షపాతం నమోదైంది. గండేడ్, మూసాపేట, మహమ్మదాబాద్ మండలాల్లోనూ వర్షం కురిసింది. ఇప్పటికే వానాకాలం సాగుకు రైతులు సన్నద్ధమవుతుండగా.. తాజాగా కురుస్తున్న వర్షాలతో పొలాల్లో తేమ శాతం పెరిగింది. మరోవైపు వాతావరణ శాఖ రానున్న రోజుల్లోనూ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.


