అనుకున్న జీపీ రాలేదనే.. | - | Sakshi
Sakshi News home page

అనుకున్న జీపీ రాలేదనే..

Jun 14 2026 10:01 AM | Updated on Jun 14 2026 10:01 AM

జెడ్పీసెంటర్‌(మహబూబ్‌నగర్‌): జిల్లాలో పంచాయతీ కార్యదర్శులు ఇటీవల జరిగిన బదిలీల్లో తాము అనుకున్న జీపీలు రాలేదని పంచాయతీ కార్యదర్శులు వాపోతున్నారు. దీంతో బదిలీలు జరిగి పదిరోజులు కూడా కాలేదు. అప్పుడే డిప్యుటేషన్ల కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు. అనుకున్న, లాభసాటి కలిగిన జీపీల్లో పోస్టింగ్‌ రాకపోవడంతో పలువురు కార్యదర్శులు డిప్యుటేషన్ల కోసం జిల్లా పంచాయతీ కార్యాలయం (డీపీఓ) చుట్టూ తిరుగుతున్నారు. ఇలా కాదంటే పరస్పర బదిలీలు చేయాలని అధికారులను కోరుతున్నారు. మే చివరి వారంలో 151మంది కార్యదర్శుల బదిలీలకు కలెక్టరేట్‌లో కౌన్సెలింగ్‌ నిర్వహించారు. ఈనెల 1నుంచి ఆర్డర్‌ కాపీలతో కొత్త జీపీల్లో బాధ్యతలు చేపట్టారు. కొంతమందికి జీపీలు నచ్చకపోవడం, సర్పంచులతో కలిసి పనిచేసే వాతావరణం లేకపోవడం, విధులకు జీపీ దూరంగా ఉండడంతో వారం తిరగక ముందే డిప్యుటేషన్ల రాగం అందుకున్నారు. జీపీలను మార్చాలని డీపీవో ఆఫీసులో అధికారులను కలుస్తున్నారని సమాచారం. ఇటు బదిలీలపై కొత్తగా వచ్చిన కార్యదర్శులను తమకు వద్దంటూ కొందరు సర్పంచులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తుంది. తమకు అనుకూలంగా ఉండే వారికే పోస్టింగ్‌ ఇవ్వాలని లేదా పాతవారినే కొనసాగించాలని కోరుతూ ఉన్నతాధికారులకు వినతిపత్రాలు ఇచ్చి అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. అయితే బదిలీలు పూర్తయిన ఏడాది వరకు ఎలాంటి డిప్యుటేషన్లు ఇవ్వొద్దని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉండడం, కలెక్టర్‌ ఖుష్బూగుప్తా కూడా అధికారులకు స్పష్టంగా చెప్పడంతో డిప్యుటేషన్లను ముట్టుకోవడానికి వెనకాడుతున్నారు. డిప్యుటేషన్లు చేయలేమని డీపీవో అధికారులు సదరు కార్యదర్శులు, సర్పంచులకు సూచిస్తున్నారు. బదిలీ స్థానాల్లోనే కార్యదర్శులు పనిచేయాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు. ఇటీవల జరిగిన బదిలీల ప్రక్రియలో పంచాయతీ కార్యదర్శులు గ్రామ పంచాయతీలుగా ఉన్న తండాల జోలికి వెళ్లలేదని తెలుస్తోంది.

ఎమ్మెల్యేలు చెప్పడంతోనేనా..?

తమ నియోజకవర్గంలో పనిచేసే చాలామంది పంచాయతీ కార్యదర్శులను తప్పించి పక్క నియోజకవర్గంలో పనిచేసేవారిని రప్పించుకోవాలని ఆయా ఎమ్మెల్యేలు అధికారులకు చెప్పినట్లు సమాచారం. ఆ మేరకు బదిలీలు చేయాలని జిల్లా ఉన్నతాధికారులపై ఎమ్మెల్యేలు ఒత్తిడి తెచ్చినట్లు తెలిసింది. బదిలీల నిబంధనలకు విరుద్ధమని ఉన్నతాధికారులు చెప్పడంతో కనీసం ఇతర మండలానికై నా బదిలీలు చేయాలని సూచించినట్లు తెలుస్తుంది. దానికి అనుగుణంగా బదిలీలు జరిగినట్లు సమాచారం.

కార్యదర్శుల ఇబ్బందులు

తాము అనుకున్న జీపీ రాలేదనే భావనలో పంచాయతీ కార్యదర్శులు ఉన్నట్లు తెలుస్తుంది. బదిలీల సమయంలో తాము పనిచేస్తున్న మండలంలోనే చాలామంది ఆప్షన్లు ఇచ్చారు. తీరా కౌన్సెలింగ్‌ సమయంలో ఉన్న మండలం కాకుండా వేరే మండలాల్లోని జీపీలు కోరుకోవాలని అధికారులు చెప్పడంతో చేసేది లేక హడావుడిగా పక్క మండలాల్లోని జీపీలను కోరుకున్నారు. దీంతో పంచాయతీ కార్యదర్శులు ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తుంది. బదిలీ ఉంటే తాము కోరుకున్న స్థానాన్ని కోరుకునే హక్కు ఉద్యోగులకు ఉందని ప్రశ్నిస్తున్నారు. అందుకు భిన్నంగా బదిలీలు జరిగాయనే ఆరోపిస్తున్నారు.

బదిలీ కాగానే కార్యదర్శుల డిప్యుటేషన్‌ రాగం

నచ్చినచోట పోస్టింగ్‌కు పలువురి పావులు

కొత్తవారు వద్దంటూ కొందరు సర్పంచుల సిఫార్సులు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement