కొత్తకోట రూరల్: నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళ మెడలోని బంగారు గొలుసును గుర్తుతెలియని వ్యక్తులు బైక్‌పై వచ్చి లాక్కెళ్లిన ఘటన కొత్తకోట మండల కేంద్రంలో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. బాధితురాలు తెలిపిన వివరాల మేరకు రామనంతపురం గ్రామానికి చెందిన పసుపుల మన్నెమ్మ కొంత కాలంగా కొత్తకోట పట్టణంలో నివాసం ఉంటోంది. శనివారం సాయంత్రం పని నిమిత్తం ఇంటి నుంచి బయటకు వచ్చి పని ముగించుకుని ఇంటికి వెళ్తున్న క్రమంలో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు బైక్‌పై వచ్చి ఆమె మెడలోని రెండు తులాల బంగారు గొలుసును అపహరించి పరారయ్యారు. బాధితురాలి అరుపులు విని స్థానికులు అక్కడికి చేరుకునేలోపే నిందితులు తప్పించుకున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనాస్థల పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. నిందితులను గుర్తించి పట్టుకునేందుకు చర్యలు చేపట్టినట్లు ఎస్‌ఐ తెలిపారు.


