పాలమూరు: జిల్లా జనరల్ ఆస్పత్రితో పాటు పాలమూరు మెడికల్ కళాశాల నుంచి బదిలీ అయిన ప్రొఫెసర్ల స్థానంలో కొత్త వారికి పోస్టింగ్ ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జనరల్ ఆస్పత్రిలో ఖాళీ అయిన విభాగాలకు నూతన ప్రొఫెసర్లను కేటాయించారు. ఆస్పత్రి, మెడికల్ కళాశాల కలిపి మొత్తం 12 విభాగాలకు నూతన హెచ్‌ఓడీలు రానున్నారు. ఇప్పటికే మూడు విభాగాలకు సంబంధించిన హెచ్‌ఓడీలు పోస్టింగ్ ఇచ్చారు. ఇక బుధవారం మరో ముగ్గురు హైదరాబాద్ నుంచి బదిలీపై జిల్లాకు వచ్చారు. దీంట్లో పీడియాట్రిక్ హెచ్‌ఓడీగా డాక్టర్ అజయ్ మోహన్, ఈఎన్‌టీ హెచ్‌ఓడీగా డాక్టర్ కబీర్, అనాటమీ హెచ్‌ఓడీగా డాక్టర్ జానకి, మైక్రోబయాలజీ హెచ్‌ఓడీగా డాక్టర్ పావని బదిలీపై రానున్నారు. అదేవిధంగా అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్‌లలో పీడియాట్రిక్ విభాగంలో డాక్టర్ ఉజ్మా తబాసుమ్, రేడియాలజీలో డాక్టర్ కె.పవన్‌కుమార్, అనస్తీషియాలో కె.సుధ, ఎం.జ్యోత్స్నాదేవి, డాక్టర్ జ్ఞానేశ్వరి, డీవీఎల్ విభాగంలో వి.దీప్తి, గైనిక్‌లో డాక్టర్ సీహెచ్ నిషితలు బదిలీపై జనరల్ ఆస్పత్రికి రానున్నారు.
విధుల్లో చేరే వరకు అనుమానమే..
మొదటి నుంచి పాలమూరులో విధులు నిర్వహించడానికి వైద్యులు ఎక్కువ ఆసక్తి చూపడం లేదనే విషయం తెలిసిందే. చాలా మంది హైదరాబాద్ శివారు ప్రాంతాలకు వెళ్లడానికి ఆసక్తి చూపుతుంటారు. రోజు వారి రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని భావిస్తారు. ప్రస్తుతం జనరల్ ఆస్పత్రితో పాటు మెడికల్ కళాశాలకు బదిలీపై వచ్చిన నూతన ప్రొఫెసర్లు, అసోసియేట్, అసిస్టెంట్లు విధులు చేరే వరకు అనుమానమే. ఈ ప్రక్రియ మూడు రోజుల్లో పూర్తి కానున్న నేపథ్యంలో ఆ తర్వాత ఆస్పత్రిలో పని చేసే వారిపై స్పష్టత రానుంది.
● జిల్లా వైద్యారోగ్యశాఖలో పని చేస్తున్న మాస్ మీడియా అధికారిని మంజుల రంగారెడ్డి జిల్లాకు బదిలీ అయ్యారు. అలాగే జనరల్ ఆస్పత్రిలో ఆర్‌ఎంఓగా పని చేసిన డాక్టర్ జరీనా భాను మహమ్మదాబాద్ పీహెచ్‌సీ మెడికల్ ఆఫీసర్‌గా బదిలీపై వెళ్లారు.
జనరల్ ఆస్పత్రికి హైదరాబాద్ నుంచి బదిలీపై వస్తున్న వైద్యులు
విధుల్లో చేరే వరకు వీడని సస్పెన్స్
పాలమూరు అంటే వెనుకడుగు
వేస్తున్న ఆచార్యులు
హైదరాబాద్ శివారు ప్రాంతాలపై
ఆసక్తి అధికం
మూడు రోజుల్లో పూర్తికానున్న
బదిలీల ప్రక్రియ


