కాగితాలకు చెల్లుచీటి | - | Sakshi
Sakshi News home page

కాగితాలకు చెల్లుచీటి

Jun 9 2026 8:46 AM | Updated on Jun 9 2026 8:46 AM

మీసేవ సేవలన్నీ ఆన్‌లైన్‌లోనే..

ఈఎస్‌డీ నుంచి ఉత్తర్వులు.. కలెక్టర్‌ నుంచి ఆదేశాలు

ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలని ఒత్తిడి తేవొద్దని సూచన

హన్వాడ: రాష్ట్రంలోని మీసేవా కేంద్రాల ద్వారా వివిధ ప్రభుత్వ సేవల కోసం దరఖాస్తు చేసుకునే వారికి ప్రభుత్వం ఉపశమనం కలిగించింది. ఆదాయం, కుల, నివాస, కుటుంబ సభ్యుల ధ్రువీకరణ పత్రాలు, ఈబీసీ, ఓబీసీ వంటి రెవెన్యూ శాఖ సేవల వెరిఫికేషన్‌ కోసం ఇకపై ఎలాంటి ఫిజికల్‌ డాక్యుమెంట్లను సమర్పించాల్సిన అవసరం లేదని రాష్ట్ర ఈఎస్‌డీ (మీసేవ) కమిషనర్‌ రవికిరణ్‌ సర్క్యూలర్‌ జారీ చేస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీంతో కలెక్టర్‌ ఖుష్చూగుప్తా స్పందిస్తూ సోమవారం జిల్లాలోని అన్ని మండలాల తహసీల్దార్లకు కీలక ఆదేశాలు జారీ చేశారు. క్షేత్రస్థాయి పరిశీలన కోసం దరఖాస్తుదారులపై భౌతిక పత్రాల సమర్పణ కోసం ఎలాంటి ఒత్తిడి తీసుకురావొద్దని ఆమె స్పష్టం చేశారు.

మొబైల్‌ యాప్‌ ద్వారానే..

రెవెన్యూ సేవల ధ్రువీకరణ ప్రక్రియలో పారదర్శకత, వేగం పెంచేందుకు ఈఎస్‌డీ సంస్థ ‘జీపీఓ మరియు ఎమ్మార్‌ఐ వెరిఫికేషన్‌ మొబైల్‌ అప్లికేషన్‌’ను రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులోకి తెచ్చింది. ప్రారంభంలో ఈ మొబైల్‌ యాప్‌ విధానాన్ని కేవలం ఆదాయం ధ్రువీకరణ పత్రాల జారీకే పరిమితం చేసినప్పటికీ.. ప్రస్తుతం దీనిని రెవెన్యూ శాఖలోని అన్ని కేటగిరీ–బీ సేవలకు విస్తరించారు. ఈ యాప్‌ ద్వారా క్షేత్రస్థాయి అధికారులు మీసేవ దరఖాస్తు వివరాలను, ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేసిన పత్రాలను నేరుగా మొబైల్‌లోనే పరిశీలించవచ్చు. దరఖాస్తును ఆమోదించాలా.. లేదా తిరస్కరించాలా అనే నిర్ణయాన్ని అధికారులు ఈ యాప్‌ ద్వారానే తీసుకుంటారు. దీంతో ఇకపై కులం, నివాసం, కుటుంబ సభ్యుల ధ్రువీకరణ, ఈబీసీ, ఓబీసీ ఇతర సర్టిఫికెట్లను పొందేందుకు ప్రజలు కార్యాలయాల చుట్టూ కాగితాలు పట్టుకుని తిరగాల్సిన అవసరం లేదు.

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

వెరిఫికేషన్‌ పేరుతో దరఖాస్తుదారుల నుంచి భౌతిక పత్రాలు తీసుకోవద్దని జిల్లా, మండల, గ్రామస్థాయిలోని తహసీల్దార్‌లు, ఎమ్మార్‌ఐలు, జీపీఓలందరికీ సీసీఎల్‌ఏతో పాటు జిల్లా యంత్రాంగం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి. అదేవిధంగా మీసేవ కేంద్రాల నిర్వాహకులు కూడా దరఖాస్తుదారులను భౌతిక పత్రాల కోసం ఇబ్బంది పెట్టకూడదని స్పష్టం చేశారు. ఒక వేళ నిబంధనలకు విరుద్ధంగా మీసేవ నిర్వాహకులు భౌతిక పత్రాలను సేకరించి అధికారులకు సమర్పిస్తే దాన్ని అక్రమాలకు పాల్పడడంగా భావించి ఈఎస్‌డీ నిబంధనలు క్లాజ్‌ 23(5) ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

అధికారులకు పర్యవేక్షణ బాధ్యతలు

ఈ సరికొత్త డిజిటల్‌ నిబంధనలు క్షేత్రస్థాయిలో సక్రమంగా అమలు అవుతున్నాయో లేదో పరిశీలించేందుకు జిల్లా మేనేజర్లు (డీఎంలు), జిల్లా కోఆర్డినేటర్లు (డీసీలు) నిరంతరం తనిఖీలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. వీరు ప్రతి వారం నివేదికను ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది. ఈ ఆదేశాలను ఉల్లంఘించే అధికారులపై ఎలాంటి ముందస్తు నోటీసు లేకుండానే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని కమీషనర్‌ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement