సైబర్‌ మోసాలపై ప్రత్యేక దృష్టి సారించాలి: ఎస్పీ | - | Sakshi
Sakshi News home page

సైబర్‌ మోసాలపై ప్రత్యేక దృష్టి సారించాలి: ఎస్పీ

Jun 9 2026 8:40 AM | Updated on Jun 9 2026 8:40 AM

మహబూబ్‌నగర్‌ క్రైం: ప్రజావాణిలో వచ్చిన ప్రతి ఫిర్యాదుపై సత్వర చర్యలు తీసుకోవడంతో పాటు బాధితులకు న్యాయం చేయాలని ఎస్పీ డి.జానకి అన్నారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం పోలీసు ప్రజావాణి సందర్భంగా జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. పోలీస్‌ స్టేషన్‌కు వచ్చే బాధితుల సమస్యలపై మొదట వినాలని, ఆ తర్వాత వాటికి పరిష్కారం చూపాలన్నారు. ఫిర్యాదులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. మహిళలు, వృద్ధులు, సైబర్‌ మోసాలకు గురైన బాధితుల ఫిర్యాదులను ప్రత్యేక ప్రాధాన్యతతో పరిశీలించాలన్నారు.

బాదేపల్లి యార్డులో జోరుగా క్రయవిక్రయాలు

జడ్చర్ల: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్‌లో సోమవారం వివిధ ప్రాంతాల నుంచి భారీగా ధాన్యం విక్రయానికి వచ్చింది. 4,601 బస్తాల ధాన్యం విక్రయానికి రాగా ఆర్‌ఎన్‌ఆర్‌ రకం క్వింటా గరిష్టంగా రూ.2,806, కనిష్టంగా రూ.1,699 ధరలు లభించాయి. అదేవిధంగా 3609 బస్తాల మొక్కజొన్న మార్కెట్‌కు రాగా క్వింటాకు గరిష్టంగా రూ.2,002, కనిష్టంగా రూ.1,601 ధరలు లభించాయి. ఇక ఆముదాలు క్వింటా గరిష్టంగా రూ.6,315, కనిష్టంగా రూ.6,255, వేరుశనగ రూ.4,921, పొద్దుతిరుగుడు గరిష్టంగా రూ.6,780, కనిష్టంగా రూ.3,780 ధరలు పలికాయి.

గుర్తింపులేని పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి

మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీ: ప్రభుత్వ గుర్తింపు లేని పాఠశాలలపై తగు చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రైవేట్‌ స్కూల్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఎన్‌.ప్రభాకర్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్‌లో డీఈఓ విజయకుమారిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కనీసం కిలోమీటరు దూరం ఉంటేనే అనుమతి ఇవ్వాలన్నారు. విద్యార్థులు వేరే పాఠశాలల్లో చేరేటప్పుడు పూర్వపు పాఠశాల బోనఫైడ్‌, టీసీ తప్పనిసరిగా ఉండాలన్నారు. ముఖ్యంగా జిల్లాలో కిడ్స్‌ ప్లే స్కూల్స్‌ పేరిట ఎక్కడబడితే అక్కడ ఏర్పాటు చేస్తున్నారని వీటిని నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కొన్నిచోట్ల ప్రైవేట్‌ స్కూళ్లపై వివిధ విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాల నాయకులు దాడులకు పాల్పడటం తగదన్నారు. అనంతరం ఆమెకు పూలబొకే ఇచ్చి సన్మానించారు. కార్యక్రమంలో సంఘం నాయకులు బి.రాంచందర్‌, వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement