● స్థలాలు కేటాయించకపోవడంతో అభివృద్ధి పనుల్లో జాప్యం
● కిరికిరిలో ప్రభుత్వ భూములు
● అధికారులకు తలనొప్పిగా మారిన కోర్టు కేసులు
మహబూబాబాద్: జిల్లా కేంద్రంలో వేల ఎకరాల ప్రభుత్వ భూములు కేవలం రికార్డులకే పరిమిత మయ్యాయి. చాలా వరకు ప్రభుత్వ భూములు కబ్జాకు గురి కాగా.. ఉన్న భూములు కూడా కోర్టు కేసుల్లో ఉన్నాయి. దీంతో ప్రభుత్వ అభివృద్ధి పనులకు స్థలాల కేటాయింపు పరిశీలనకే పరిమితమవుతోంది. దీంతో పనులు ముందుకు సాగడం లేదు. అలాగే కోర్టు కేసులు అధికారులకు తలనొప్పిగా మారాయి. నిర్మాణంలోని పలు అభివృద్ధి పనులు కూడా కోర్టు కేసులతో నిలిచిపోయాయి.
కబ్జాల పర్వం..
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్నాయి. చివరకు చెరువులను కూడా వదలడం లేదు. అవి కుంట లుగా మారాయి. చివరకు కలెక్టరేట్ నిర్మా ణం కోసం కూడా స్థల సమస్య ఎదురైంది. ఆవిషయంలోఆందోళనలు జరిగి చివరకు కొంత మంది రైతులకు నష్టరిహారం చెల్లించాల్సి వచ్చింది. ఎట్టకేలకు నిర్మాణం పూర్తి చేశారు. మెడికల్ కాలేజీతో పాటు పలు ప్రభుత్వ భవనాల నిర్మాణాలకు కూడా భూ సమస్యలు తలెత్తాయి.
పరిశీలనకే పరిమితమైన కేటాయింపు..
● జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి పనుల కోసం రెవెన్యూ, సంబంధిత అధికారులు కొన్ని నెలలుగా స్థలాల కేటాయింపు కోసం సర్వేలు చేస్తున్నారు.
● జిల్లా కేంద్రంలో రైల్వే మెగా ఫ్రైట్ మెయింటెనెన్స్ డిపో మంజూరు కాగా.. నిర్మాణం కోసం స్థలాలు పరిశీలిస్తున్నారు. కాగా, మానుకోట మున్సిపాలిటీ పరిధి అనంతారం గ్రామ శివారు మొగిలిచర్ల రోడ్డులో సర్వే నంబర్ 137లో స్థల పరిశీలన చేసి 409 ఎకరాలు గుర్తించారు. కాని నేటికీ రైల్వే అధికారులకు కేటాయించలేదు.
● ఇంటెలిజెన్స్ ఆఫీసు కోసం సర్వే నంబర్ 551లో ఎస్పీ ఆఫీస్ సమీపంలో అర ఎకరం స్థల పరిశీలన చేశారు. అయితే కేటాయించలేదు.
● పోలీస్‌శాఖకు చెందిన భరోసా కేంద్రం, ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ కోసం కలెక్టరేట్ రోడ్డులో 251 సర్వే నంబర్‌లో రెండెకరాలు గుర్తించారు. నేటికీ కేటాయించలేదు.
● జువైనల్‌హోం కోసం 551 సర్వే నంబర్‌లో రెండున్నర ఎకరాల స్థలం కేటాయించినా పలు సమస్యలున్నాయి. హార్టికల్చర్ కాలేజీ కోసం 551సర్వే నంబర్‌లో 16ఎకరాలు మెడికల్ కాలేజీ సమీపంలో పరిశీలించారు.
● ఇంజనీరింగ్ కాలేజీ కోసం జిల్లాకేంద్రం శివారులో గుమ్ముడూర్‌లో 281,287 సర్వే నంబర్లలో 70 ఎకరాలు కేటాయించారు. దానిలోనూ సమస్యలు ఉన్నాయి.
కొలిక్కి రాని వివాదాలు..
జిల్లా కేంద్రంలోని కొత్తబజార్‌లో రెండెకరాల్లో ఆఫీసర్ క్లబ్ ఉంది. ఆ స్థలం విషయంలో స్పష్టత లేదు. మున్సిపాలిటీకి సంబంధించినదేనని, దానిలో ఇండోర్ స్టేడియంలో లేక కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణం చేయాలని దశాబ్దకాలంగా అంటున్నారు. అలాగే ఇందిరాగాంధీ సెంటర్‌లో సుమారు 2,000 గజాల స్థలం ఉంది. దానిని 2019లో వేలం వేసే ప్రయత్నాలు జరిగాయి. కోఆపరేటివ్ బ్యాంక్ అధికారులు ఆ స్థలం తమదే అని అంటుండగా.. మున్సిపాలిటీ అధికారులు ఆస్థలం మన్సిపాలిటీదని వాదనలు జరుగుతున్నాయి.
కోర్టు కేసులతో..
జిల్లా కేంద్రం శివారులో చేపట్టిన డబుల్ బెడ్రూం ఇళ్లలో కొన్ని కోర్టు కేసుల వల్ల నిలిచిపోయాయి. ఈనెల 10న కలెక్టర్ స్నేహశబరీష్ వాటిని పరిశీలించారు.
2018లో అనంతారం రోడ్డులో ఆరెకరాల స్థలంలో స్మృతి వనం పనులు చేపట్టారు. సగానికి పైగా పనులు జరిగాయి. అప్పటి కలెక్టర్ తన క్యూషల్ ఫండ్ నుంచి రూ 27.50 లక్షలు కేటాయించారు. కానీ కోర్టు కేసులతో పనులు నిలిచిపోయాయి.


