రఘునాథపల్లి: వివాహవేడుకకు హాజరై తిరుగు ప్రయాణమైనవారు మరో అరగంటలో స్వస్థలానికి చేరుకుంటారనగా వారు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి రోడ్డు కింద చెట్లను ఢీకొట్టడంతో ఇద్దరు మృతిచెందగా.. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం గోవర్దనగిరి దర్గా వద్ద జాతీయ రహదారిపై జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించి స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హనుమకొండలోని నయీంనగర్ ప్రాంతానికి చెందిన మహ్మద్ అజిముద్దీన్ భార్య షాహిన్‌బేగం, కుమార్తె అయేషాసుల్తాన, కుమారుడు అసదుద్దీన్ (26), బంధువులు మహ్మద్ రహీముద్దీన్, అతని భార్య రేష్మ సుల్తానాతో కలిసి కొండ్రాతి సంతోష్‌కు చెందిన కారును అద్దెకు తీసుకున్నారు. రహీముద్దీన్ కారు నడుపుతూ ఈ నెల 11న కర్ణాటకలోని గుల్బర్గా వెళ్లారు. అక్కడ అతని కుమార్తె హబీబా అఫ్సా (27) బంధువుల వివాహ రిసెప్షన్‌లో పాల్గొని 12వ తేదీ రాత్రి హనుమకొండకు పయనమయ్యారు. రహీముద్దీన్ కుమార్తె హబీబాఅఫ్సా కూడా వారితో వస్తోంది. అర్ధరాత్రి 1.50 గంటల సమయంలో గోవర్దనగిరి దర్గా ఎదురుగా ఉన్న మూల మలుపు వద్ద వారు ప్రయాణిస్తున్న కారు అతి వేగంగా అదుపు తప్పి రోడ్డుకు పక్కన ఉన్న చెట్లను బలంగా ఢీకొడుతూ దూసుకెళ్లింది. ఈ ఘటనలో కారు ఎడమ వైపు ముందు సీట్లో తండ్రి పక్కన కూర్చున్న హబీబా అప్సా, ఎడమ వైపున వెనుక సీట్లో కూర్చున్న అజిముద్దిన్ కుమారుడు అసదుద్దీన్ తల, ఒంటికి తీవ్ర గాయాలయ్యాయి. కారులోని షాహిన్‌బేగం, అయేషాసుల్తాన, రహీముద్దీన్, రేష్మ సుల్తానా తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని క్షతగ్రాతులను 108లో జనగామ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ హబీబా ఆఫ్సా, అసదుద్దిన్ తెల్లవారుజామున మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారు. అజిముద్దీన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పై నరేష్ తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. గాయపడిన వారిని మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ అస్పత్రికి తరలించారు. ఇదిలా ఉండగా.. ప్రమాదస్థలాన్ని వెస్ట్‌జోన్ జనగామ డీసీపీ రాజమహేంద్రనాయక్ శనివారం సాయంత్రం పరిశీలించారు.
కారు అదుపు తప్పడంతో ప్రమాదం
ఇద్దరి దుర్మరణం
నలుగురికి తీవ్ర గాయాలు
గోవర్దనగిరి దర్గా వద్ద ప్రమాదం


