హన్మకొండ కల్చరల్: నాటక కళాకారులకు ఆదరణ కరువైందని, దాతలు, కళాపోషకులు, ప్రభుత్వం కళలు, కళాకారులను ఆదరించి నాటకరంగాన్ని బతికించుకోవాలని ప్రముఖ సాహితీవేత్త, కవి గన్నమరాజు గిరిజామనోహరబాబు అన్నారు. వరంగల్ జిల్లా రంగస్థల కళాకారుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మూడు రోజులపాటు నిర్వహించే 17వ జాతీయస్థాయి ఆహ్వాన నాటిక పోటీలు శనివారం రెండో రోజు కొనసాగాయి. ఈ మేరకు వేముల ప్రభాకర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా గిరిజామనోహరబాబు, విశిష్ట అతిథులుగా కవి రామాచంద్రమౌళి, కళారాజేశ్వరరావు, యేర కోటేశ్వరరావు, ఆకుతోట లక్ష్మణ్, డాక్టర్ కాజీపేట తిరుమలయ్య పాల్గొని జ్యోతిప్రజ్వలన చేసి నాటిక పోటీలను ప్రారంభించారు. అనంతరం వెంపటి శ్రావణి శిష్యబృందం చేసిన శాసీ్త్రయ నృత్యాలు అలరించాయి. నాటిక పోటీల్లో భాగంగా రెండోరోజు ‘ఇది అతని సంతకం’, ‘కొత్త భూతం’ నాటిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఆర్ మూర్తి, జేఎన్ శర్మ, సాదుల సురేష్, కుసుమ సుధాకర్, శ్రీధరస్వామి, జూలూరు నాగరాజు, ఆకుల సదానందం, సీత వెంటేశ్వర్లు, మట్టెవాడ ఆజయ్ పాల్గొన్నారు.
పాత ఇనుప సామగ్రి దుకాణంలో అగ్ని ప్రమాదం
వరంగల్ క్రైం: హనుమకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాత ఇనుప సామగ్రి దుకాణంలో భారీ అగ్నిప్రమాదం జరిగినట్లు ఇన్‌స్పెక్టర్ మచ్చ శివకుమార్ తెలిపారు. ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం.. శనివారం ఉదయం 4.30 గంటల సమయంలో దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించడంతో సిబ్బంది హుటాహుటిన వచ్చి మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. పాత ఇనుప సామగ్రి దుకాణంలో పాత పుస్తకాలు, పేపర్లు పెద్ద మొత్తంలో ఉండడంతో మంటలు అదుపులోకి రావటానికి చాలా సమయం పట్టింది. ఈ ప్రమాదంలో సుమారు రూ.10 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు బాధితుడు రెండ్ల శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
● ప్రముఖ సాహితీవేత్త, కవి గన్నమరాజు గిరిజామనోహరబాబు


