ఎస్సైపై లైంగికదాడి కేసు | - | Sakshi
Sakshi News home page

ఎస్సైపై లైంగికదాడి కేసు

Jun 14 2026 10:31 AM | Updated on Jun 14 2026 10:31 AM

హనుమకొండ పీఎస్‌లో నమోదు

వరంగల్‌ క్రైం: వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో పనిచేస్తున్న ఓ కీచక ఎస్సై బాగోతం ఆలస్యంగా శనివారం వెలుగులోకి వచ్చింది. హనుమకొండ ఇన్‌స్పెక్టర్‌ మచ్చ శివకుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. నాలుగేళ్ల క్రితం హనుమకొండ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఓ మహిళ తన భర్త వేధింపులు భరించలేక ఫిర్యాదు చేసేందుకు స్టేషన్‌కు వచ్చింది. అప్పటి ఎస్సై గోదారి రాజ్‌కుమార్‌.. ఆ మహిళకు న్యాయం చేస్తానని నమ్మించి తనకు తెలిసిన లాయర్‌తో మాట్లాడి భర్తతో విడాకులు ఇప్పించాడు. అనంతరం పెళ్లి చేసుకుంటానని చెప్పి సదరు మహిళపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇటీవల పెళ్లి చేసుకోవాలని ఆ మహిళ ఒత్తిడి చేయడంతో ఎస్సై రాజ్‌కుమార్‌ నిరాకరించడంతోపాటు విషయం ఎక్కడైనా చెబితే నగ్నంగా ఉన్న ఫొటోలు, వీడియోలు అందరికీ షేర్‌ చేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. చివరికి బాధితురాలు హనుమకొండ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు రాజ్‌కుమార్‌పై కేసు నమోదు చేసినట్లు ఇన్‌స్పెక్టర్‌ మచ్చ శివకుమార్‌ తెలిపారు. ఇదిలా ఉండగా.. ఎస్సై గోదారి రాజ్‌కుమార్‌ ప్రస్తుతం సీసీఎస్‌లో విధులు నిర్వర్తిస్తున్నాడు.

మామపై దాడి చేసిన అల్లుడు, మరో ఇద్దరి అరెస్ట్‌

వివరాలు వెల్లడించిన ఎస్సై సురేష్‌

వేలేరు: తన వ్యవసాయ పొలానికి దారి లేకుండా చేశాడనే కక్షతో పిల్లను ఇచ్చిన మామను తీవ్రంగా కొట్టిన అల్లుడు, అతని తల్లి, అన్నలను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు వేలేరు ఎస్సై అజ్మీరా సురేష్‌ శనివారం తెలిపారు. ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం.. హనుమకొండ జిల్లా వేలేరు మండలంలోని ఎర్రబెల్లి గ్రామానికి చెందిన బలాష్టి వీరేశం కూతురును తన అల్లుడు రాజు కాపురానికి తీసుకెళ్లడంలేదనే కోపంతో తన పొలం నుంచి అల్లుడి పొలానికి వెళ్లే దారిని మూసివేశాడు. దీంతో మామ వీరేశంపై కక్ష పెంచుకున్న అల్లుడు ఈనెల 9న ఉదయం పొలంలో పనులు నిర్వహిస్తున్న మామను తన తల్లి వీరాబాయి, అన్న శ్రీనివాస్‌తో కలిసి కర్రలతో చితకబాదాడు. దీంతో వీరేశం భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరిపి నిందితులను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement