విద్యారణ్యపురి: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలను బలోపేతం చేయాలని తెలంగాణ ప్రభుత్వ కళాశాలల అధ్యాపకుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ సురేందర్‌రెడ్డి కోరారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల అధ్యాపకులు సుధీర్ఘ కాల ప్రయోజనాలకు సంబంధించిన జీఓ 21ని ఇటీవల ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో గతంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో లెక్చరర్లుగా పనిచేసి డిగ్రీ కళాశాలలకు పదోన్నతి పొందినవారికి జూనియర్ కళాశాలల్లో పనిచేసిన 50శాతం సర్వీస్‌ను కెరియర్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్(క్యాస్)లో పదోన్నతులకు పరిగణలోనికి తీసుకోనున్నారు. దీంతో ఎంతోమంది డిగ్రీ కళాశాలల లెక్చరర్లకు అసోసియేట్ ప్రొఫెసర్లుగా, ప్రొఫెసర్లుగా ప్రయోజనం లభించనుంది. ఈజీఓ సాధించినందుకు సురేందర్‌రెడ్డికి శనివారం హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల అధ్యాపకులు, సంఘం బాధ్యులు అభినందన సభ నిర్వహించారు. ఈసందర్భంగా సురేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఈ జీఓ సాధనకోసం సంఘం నిరంతరంగా పోరాడిందన్నారు. విద్యారంగంలోని సంస్కరణలకు కట్టుబడి ఉంటూ ఈ కీలకమైన జీఓ 21ని ప్రత్యేక చొరవ తీసుకొని ఆమోద ముద్రవేసిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఆధునిక డిజిటల్ తరగతులు, మౌలికవసతులు మెరుగుపర్చాలన్నారు. అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలని కోరారు. కేడీసీ ప్రిన్సిపాల్ గుర్రం శ్రీనివాస్, టీజీసీజీటీఏ రాష్ట్ర అధ్యక్షుడు గోపి, ఉపాధ్యక్షుడు డాక్టర్ చిన్నా, మహిళా సెక్రటరీ డాక్టర్, శ్రావణి, స్టేట్ ఫైనాన్స్ సెక్రటరీ డాక్టర్ రమేష్‌గౌడ్, మల్టీజోన్–1 సెక్రటరీ డాక్టర్ శంకరయ్య, గౌరవ ససలహాదారు డాక్టర్ బెల్లియాదయ్య, యూనివర్సిటీ కోఆర్డినేటర్ డాక్టర్ రామకృష్ణారెడ్డి, స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ రాజారామ్, శాతవాహన యూనివర్సిటీ కోఆర్డినేటర్ డాక్టర్ మల్లారెడ్డి, పాలమూరు యూనివర్సిటీ కోఆర్డినేటర్ రాఘవేందర్‌రెడ్డి మాట్లాడారు. బాధ్యులు, శాంతికుమార్, ములుగు, పర్కాల డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాళ్లు డాక్టర్ మల్లేశం, డాక్టర్ సంతోష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
టీజీసీజీటీఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేందర్‌రెడ్డి


