ఏటూరునాగారం: వెండి పట్టగొలుసులకు మెరుగు పెడుతామని నమ్మించి ప్రజలను మోసం చేసిన ఘటన ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం ఓడవాడలో శనివారం వెలుగుచూసింది. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా.. శుక్రవారం సాయంత్రం మండల కేంద్రంలోని 11వ వార్డుకు చెందిన ఇర్సవడ్ల భాగ్య, సుంకరి లలిత, బొడ్డు హరిత, పాలిశెట్టి రమణల వద్దకు ఓ వ్యక్తి వచ్చి వెండి పట్టగొలుసులకు మెరుగు పెడుతానని చెప్పి కాళ్లకు ఉన్న గొలుసులు తీసుకొని తనతో తెచ్చుకున్న రసాయనంలో శుభ్రం చేశాడు. ఇలా నలుగురితోపాటు మరో పది మంది వద్ద గొలుసులు రసాయనంలో పాలిష్ వేస్తామని చెప్పాడు. అయితే సదరు వ్యక్తి డబ్బులు తీసుకోకుండానే ఎందుకు పట్టగొలుసులను శుభ్రం చేస్తున్నాడని అనుమానించిన మహిళలు తమకు తెలిసిన బంగారం షాపు వద్దకు వెళ్లి గొలుసులను తూకం వేయించగా.. బరువు తగ్గి ఉన్నాయి. 20 తులాలు ఉన్న పట్టగొలుసు పది తులాలు, 10 తులాలు ఉన్న గొలుసు 6 తులాలు ఇలా తరుగు పేరుతో అరగదీసి ఆ వ్యక్తి పరారైనట్లు గ్రహించి కన్నీటి పర్యంతమయ్యారు. ఒకే రోజు 15 మంది గొలుసుల తరుగు పేరుతో వెండిని తస్కరించడం సంచలనం కలిగించింది. దీనిపై పోలీసులను వివరణ కోరగా బాధితుల నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు.
ఆలస్యంగా గుర్తించిన బాధితులు
ఏటూరునాగారంలో ఘటన


