నందవరం: ఎగువ ప్రాంతాలైన మంత్రాలయం, నందవరం, కోసిగి తదితర ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షానికి తుంగభద్రమ్మ జలకళను సంతరించుకుంది. సోమవారం మండల పరిధిలోని నాగలదిన్నె బ్రిడ్జి వద్ద వరద నీరు ప్రవహించింది. నిన్నటి వరకు వెలవెలబోయిన తుంగభద్ర నది నేడు కనువిందు చేస్తోంది.
అర్జీదారులు సంతృప్తి చెందేలా పరిష్కారం
కర్నూలు(సెంట్రల్): ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఫిర్యాదులను అర్జీదారులు సంతృప్తి చెందే స్థాయిలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆమె జేసీ నూరుల్ ఖమర్, డీఆర్వో సి.వెంకటనారాయణమ్మలతో కలసి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. సరైన ఎండార్స్‌మెంట్‌తోనే రీఓపెన్ కేసులను తగ్గించవచ్చని, జిల్లా అధికారులు రోజూ పీజీఆర్‌ఎస్ సైట్‌ను ఓపెన్ చేసుకొని సరైనా ఎండార్స్‌మెంట్ ఇవ్వాలన్నారు. జిల్లాలో పెండింగ్ కారుణ్య నియామకాలకు సంబంధించిన కేసులను పరిష్కరించేందు కు 15 రోజుల్లోనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో స్పెషల్ డెప్యూటీ కలెక్టర్లు రామసుబ్బయ్య, శివప్రసాద్‌రెడ్డి పాల్గొన్నారు.
జీవాలకు చిటుకు వ్యాధి టీకాలు
కర్నూలు(అగ్రికల్చర్): సన్న జీవాలలో చిటుకు వ్యాధి నివారణకు ముందు జాగ్రత్తగా టీకాలు వేసే కార్యక్రమం జిల్లాలో మొదలైనట్లు జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి డాక్టర్ రాజశేఖర్ తెలిపారు. ఈ నెల 15 నుంచి వచ్చే నెల 15 వరకు టీకాల కార్యక్రమం కొనసాగుతుందని, గొర్రెల పెంపకందారులు విధిగా జీవాలకు చిటుకు వ్యాధి(ఈటీ) టీకాలు వేయించాలని ఆయన సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అకస్మాత్తుగా చనిపోవడం, మేత తినడం మానేయడం, కడుపునొప్పి/ఉబ్బరం, విరేచనాలు, నోటి నుంచి నురుగ, వణుకు/ఫిట్స్ రావడం చిటుకు వ్యాధి లక్షణాలన్నారు. ఉచితంగా వేసే టీకాలను గొర్రెల పెంపకందారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
24న జొన్నగిరికి
సీఎం చంద్రబాబు
కర్నూలు(సెంట్రల్): సీఎం చంద్రబాబు ఈనెల 24న జిలాల్లోని తుగ్గలి మండలం జొన్నగిరికి రానున్న నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అధికారులను ఆదేశించారు. అక్కడి జియో మైసూర్ గోల్డ్‌మైన్స్‌ను సీఎం సందర్శిస్తారన్నారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారన్నారు. సోమవా రం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాలులో కలెక్టర్ అధ్యక్షతన సీఎం పర్యటన ఏర్పాట్లపై జిల్లా అధికారులతో సమీక్షించారు. జేసీ నూరుల్ ఖమర్, డీఆర్వో సి.వెంకటనారాయణమ్మ పాల్గొన్నారు.


