● ‘సాక్షి’ ప్రశ్నలకు నీళ్లు నమిలిన
ఇరిగేషన్ మంత్రి
కర్నూలు సిటీ: రాయలసీమలోనే అత్యంత వెనుకబడిన కర్నూలు జిల్లా పశ్చిమ పల్లెలకు తాగు, సాగునీటి సదుపాయం కల్పిస్తామని ప్రతి ఎన్నికల్లో హామీలు ఇస్తూ అధికారంలోకి వచ్చాక టీడీపీ ప్రభుత్వం మోసగిస్తోంది. రెండేళ్లు గడిచినా అమలుపై దాటవేస్తుండటం విమర్శలకు తావిస్తోంది. సోమవారం జిల్లాకు వచ్చిన జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆ శాఖ కర్నూలు ప్రాజెక్ట్స్ సీఈ కార్యాలయంలో జిల్లా సాగునీటి ప్రాజెక్టుల పనులు, ప్రతిపాదిత ప్రాజెక్టులపై సమీక్షించారు. పలు పనులను నాయకులు మంత్రి దృష్టికి తీసుకురాగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఇంజనీర్లకు సూచించారు. ఆ తరువాత మంత్రి విలేకర్ల సమావేశం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతుండగా.. ఎన్డీఏ ప్రభుత్వంలో కీలకంగా ఉన్న టీడీపీ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పూర్వోదయం పథకం కింద రాయలసీమలో పురోగతిలోని ఒక్క ప్రాజెక్టును కూడా ఎందుకు చేర్చలేకపోయారని ‘సాక్షి’ ప్రశ్నించగా.. పూర్వోదయం కింద ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు చేర్చామంటూ దాటవేశారు.
● డ్రీప్ కింద ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్న మంత్రిని డ్రీప్ కింద శ్రీశైలం ప్రాజెక్టు ఫ్లంజ్ ఫూల్ కోసం రూ.253 కోట్లతో మీ ప్రభుత్వం ఎందుకు ప్రతిపాదనలు పంపలేదని ‘సాక్షి’ ప్రశ్నించగా సమాధానం చెప్పలేక రాయలసీమ మేలుకు రాష్ట్ర బడ్జెట్‌లో 51 శాతం ఖర్చు చేయనున్నామని సమర్థించుకున్నారు.
● అలగనూరు, జీఆర్‌పీ స్కీంలకు మరమ్మతులు చేయించడం లేదని ‘సాక్షి’ మంత్రిని ప్రశ్నిస్తే.. రాయలసీమలో హార్టికల్చర్‌ను అభివృద్ధి చేయనున్నామన్నారు.
● రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ప్రాజెక్టుల్లో జిల్లాలో కేవలం వేదావతి లిఫ్ట్ మాత్రమే చేర్చారని, మిగిలినవి ఎందుకు చేర్చలేకపోయారని, కోడుమూరు నియోజకవర్గంలో పులకుర్తి లిఫ్ట్ కింద పంట కాల్వలు ఎందుకు తీయడం లేదని ‘సాక్షి’ మంత్రిని ప్రశ్నించగా పొంతనలేని సమాధానలు చెప్పడం గమనార్హం.
● రాయలసీమ జిల్లాల్లో కర్నూలు, వైఎస్‌ఆర్ కడప జిల్లాలకు, కర్నూలు పశ్చిమ పల్లెకు జీవనాడిగా చెబుతున్న గుండ్రేవుల ప్రాజెక్టుపై ‘సాక్షి’ ప్రశ్నించగా ఎలాంటి సమాధానం చెప్పకుండానే మంత్రి మొహం చాటేశారు.


