వెలుగోడు: ట్రాక్టర్ అదుపుతప్పి కాలువలో పడిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. బాధిత కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపిన ఈ ఘటన బుధవారం వెలుగోడు మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. వేల్పనూరు గ్రామానికి చెందిన కొల్ల వెంకటేశ్వర్లు (49) తన కొత్త ట్రాక్టర్‌తో వ్యవసాయ పనుల నిమిత్తం బయలుదేరాడు. లింగాపురం శివ (42) అనే వ్యక్తి ట్రాక్టర్‌ను నడుపుతున్నాడు. ఒప్పి వాగు సమయంలో ట్రాక్టర్ అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ప్రమాదంలో వెంకటేశ్వర్లు, శివ తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందారు. వెంకటేశ్వర్లకు భార్య పద్మావతి, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. శివకు భార్య వెంకటలక్ష్మమ్మ, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. శివ కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. ఘటనపై వెంకటేశ్వర్లు భార్య పద్మావతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సురేష్ తెలిపారు.


