భారీగా గంజాయి పట్టివేత | - | Sakshi
Sakshi News home page

భారీగా గంజాయి పట్టివేత

Jun 11 2026 7:47 AM | Updated on Jun 11 2026 7:47 AM

● ఏడుగురు అరెస్ట్‌, ఆటో స్వాధీనం ● పెద్దకొత్తిలి భంభం ఆశ్రమం సమీపంలో గంజాయి సాగు

గంజాయికి బానిస కావొద్దు

● ఏడుగురు అరెస్ట్‌, ఆటో స్వాధీనం ● పెద్దకొత్తిలి భంభం ఆశ్రమం సమీపంలో గంజాయి సాగు

ఎమ్మిగనూరు రూరల్‌: గంజాయిని గుట్టుగా సాగు చేస్తూ విక్రయించే ముఠాను పోలీసులు పట్టుకున్నారు. వాహనాల తనిఖీలో గంజాయి తరలిస్తున్న నిందితులను పట్టుకోగా ముఠా పట్టుబడింది. నందవరం మండలం పెద్దకొత్తిలి భంభం ఆశ్రమం సమీపంలో గంజాయి సాగును గుర్తించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన నిందితులు, స్వాధీనం చేసుకున్న గంజాయిని రూరల్‌ పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో బుధవారం సీఐ చిరంజీవి, నందవరం ఎస్‌ఐ తిమ్మారెడ్డి మీడియా ఎదుట హాజరుపరిచారు. అనంతరం డీఎస్పీ ముర్రవాడ భార్గవి నిందితుల వివరాలను వివరించారు. కనకవీడు పోలీస్‌చెక్‌ పోస్ట్‌ దగ్గర వాహనాలు తనిఖీ చేస్తున్న రూరల్‌ సీఐ చిరంజీవి, నందవరం ఎస్‌ఐ తిమ్మారెడ్డికి ఓ ఆటోపై అనుమానం వచ్చి తనిఖీలు చేయగా 3 కేజీల గంజాయి పట్టుబడింది. ఆటోలో ఉన్న ఎమ్మిగనూరు పట్టణం శాంతినగర్‌ షేక్షావలి, మైనార్టీ కాలనీ షేక్‌చాంద్‌బాషా, కటికె వీధికి చెందిన వడ్డే భీమేష్‌, మరో బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ నలుగురు నందవరం మండలం నాగలదిన్నె గ్రామ శివారులోని మిట్టసోమపురం క్రాస్‌ రోడ్డు సమీపంలో అదే గ్రామానికి చెందిన బెస్త తిప్పన్న దగ్గర గంజాయి కొనుగోలు చేసినట్లు పోలీసుల విచారణలో బయటపడింది. అలాగే పెద్దకొత్తిలి గ్రామంలోని భంభం ఆశ్రమం సమీపంలో చాకలి రాముడు, చాకలి నాగార్జున గంజాయి సాగుచేస్తున్నట్లు తెలుసుకున్నారు. వీరిద్దరూ గంజాయిని పండిస్తూ ఆశ్రమం దగ్గర ఆరబెట్టి పొడిచేసి ఎమ్మిగనూరు, ఇతర ప్రాంతాల వారికి విక్రయించి సొమ్ముచేసుకుంటునట్లు వెలుగు చూసింది. వెంటనే ఆశ్రమం దగ్గరకు వెళ్లి ఇద్దరు నిందితులను అరెస్ట్‌ చేసి వారి నుంచి 2.340 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఆరుగురు నిందితులతో పాటు ఓ మైనర్‌ను అరెస్ట్‌ చేసి వారి నుంచి మొత్తం 5.340 కిలోల గంజాయి, ఆటోను స్వాధీనం చేసుకున్నారు. గంజాయి ముఠాను పట్టుకున్న సీఐ, ఎస్‌ఐ, సిబ్బందిని డీఎప్పీ ముర్రవాడ భార్గవి అభినందించారు. సమావేశంలో రూరల్‌ ఎస్‌ఐ శ్రీనివాసులు, నందవరం పీఎస్‌ హెచ్‌సీ కోదండరాముడు, సుభాన్‌, పీసీలు వీరేష్‌, భాస్కర్‌, వెంకటేష్‌, సుధాకర్‌, ఏవో సరిత, డిప్యూటీ తహసీల్దార్‌ మహేష్‌ తదితరులు ఉన్నారు.

గంజాయి మత్తు పదార్థాలకు యువత బానిసలు కావొద్దు. గంజాయి మత్తులో అనేక నేరాలకు పాల్పడే అవకాశం ఉంది. మాదకద్రవ్యాల మత్తులో ఏమి చేస్తున్నారో తెలియని స్థితిలోకి వెళ్తారు. ఇటీవల గంజాయి మత్తు పదార్థాలకు యువత ఎక్కువ మొగ్గుచూపుతూ భవిష్యత్‌ను నాశనం చేసుకుంటున్నారు. తమ పిల్లల నడవడికను తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలి.

– ముర్రవాడ భార్గవి, డీఎస్పీ

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement