సి.బెళగల్: బ్రాహ్మణదొడ్డి గ్రామ చెరువులో కొంతమంది దుండగులు అక్రమ తవ్వకాలను చేపట్టి, మట్టిని అక్రమంగా తరలిస్తున్నారు. చెరువులో నిబంధనలు విరుద్ధంగా జేసీబీతో తవ్వకాలు చేపట్టి, ట్రాక్టర్ల ద్వారా చెరువు మట్టిని తరలిస్తున్నారు. రైతుల పేరు చెప్పి వారి చాటున బ్రాహ్మణదొడ్డికి చెందిన కొంతమంది దుండుగులు రైతుల నుంచి ఒక్క ట్రాక్టర్ ట్రిప్పుకు అదనంగా డబ్బులు వసూళ్లు చేసుకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. పైగా తమకు మండల రెవెన్యూ అధికారుల అనుమతులు ఉన్నాయంటూ దగాకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. గత రెండు రోజులుగా దాదాపు వంద ట్రాక్టర్ల ట్రిప్పుల చెరువు మట్టి నిబంధనలు విరుద్ధంగా అక్రమార్కులు కొలుగొడుతున్నా అధికార యంత్రాంగం మాత్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదని చెనరువు పరిసర గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు.తాము ఎవరికి చెరువులో మట్టి తరలించుకునేందుకు అనుమతి ఇవ్వలేదని ఆర్‌ఐ తరుణ్ తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో
వ్యక్తి దుర్మరణం
ఓర్వకల్లు: మండలంలోని జాతీయ రహదారిపై గడివేముల క్రాస్‌రోడ్డు సమీపంలో బుధ వారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా, మరో ఇద్దరు గాయాలపాలయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నన్నూరు గ్రామానికి చెందిన కురువ రంగస్వామి (50) అనే వ్యక్తి పసుపుల రుద్రవరం గ్రామంలో నివాసం ఉంటున్నాడు. సోమయాజులపల్లె గ్రామంలో సమీప బంధువు అంత్యక్రియలకు హాజరయ్యేందుకు ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు. మార్గమధ్యలో రోడ్డుపై నడుచుకుంటు వెళ్తున్న సన్నియాదవ్, ఆసిఫ్ యాదవ్‌ను బైక్ అదుపు తప్పి ఢీకొంది. ఈ ఘటనలో ఆ ఇద్దరితో పాటు రంగస్వామి కిందపడ్డాడు. అదే సమయంలో గుర్తు తెలియని వాహనం అతనిపై ఎక్కి వెళ్లడంతో రంగస్వామికి తీవ్రగాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా కోలుకోలేక మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సునీల్‌కుమార్ తెలిపారు. మృతుడి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
గుండ్రేవులపై
పాలకులు నిర్లక్ష్యం
కర్నూలు సిటీ: రాయలసీమ జిల్లాలకు జీవనాడీ లాంటిదైనా గుండ్రేవుల ప్రాజెక్టు నిర్మాణం విషయంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాల నాయకులు మండిపడ్డారు. బుధవారం నగరంలో రాయలసీమ విద్యార్థి సంఘాల సమావేశం నిర్వహించారు. రాయలసీమ విద్యార్థి పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.రవికుమార్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థి సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు భరత్‌కుమార్ ఆచారి, రాయలసీమ యువజన విద్యార్థి ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రంగముని నాయుడు మాట్లాడుతూ గురువారం కోడుమూరులోని పరప్ప కాంప్లెక్స్ ఎదుట కర్నూలు ప్రగతి సమితి ఆధ్వర్యంలో జల సమరం పేరుతో దీక్ష చేపడుతున్నారని, ఉమ్మడి జిల్లా ఆయకట్టు రైతులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. తుంగభద్ర నదిపై 20 టీఎంసీల సామర్థ్యంతో గుండ్రేవుల ప్రాజెక్టు నిర్మిస్తే కేసీ కెనాల్‌తో పాటు, పశ్చిమ పల్లె కరువును శాశ్వతంగా తరిమేందుకు అవకాశం ఉంటుందన్నారు. గుండ్రేవుల సాధన కోసం ఎవరు ఆందోళన చేసినా రాయలసీమ విద్యార్థి సంఘాలు సంపూర్ణ మద్దతు ఇస్తాయని ప్రకటించారు.


