● మెరుగు పెడుతూ బంగారాన్ని కాజేసిన కేటుగాడు.. ● బాధిత మహిళలు లబోదిబో
కోడుమూరు రూరల్: స్థానిక కొండపేటలో గుర్తు తెలియని వ్యక్తి ఇద్దరు మహిళలను క్షణాల్లో బురిడీ కొట్టించి నాలుగున్నర తులాల బంగారాన్ని కాజేశాడు. బాధితుల కథనం మేరకు.. కోడుమూరులోని కొండపేటకు చెందిన శేఖర్ భార్య పద్మావతి, వెంకటేశ్వర్లు భార్య చంద్రకళలు వరుసకు వదినా మరదళ్లు. బుధవారం మధ్యాహ్నం వీరంతా ఇంట్లో పనులు చేసుకుంటుండగా ఓ కేటుగాడు ఇంటి వద్దకు వచ్చి ‘కంపెనీ ప్రచార నిమిత్తం వచ్చాం.. బంగారు, వెండి ఆభరణాలిస్తే.. మీ ముందే ఫ్రీగా మెరుగు పెట్టించి తళతళ మెరిసేలా చేస్తాం’ అంటూ నమ్మబలికారు. అయితే ఆ మహిళలు మొదట తమకు వద్దని చెప్పినప్పటికీ వినకుండా ఆ కేటుగాడు ‘మీ కళ్ల ముందే మెరుగు పెట్టి ఇస్తా’నంటూ పదేపదే చెప్పడంతో చంద్రకళ తన వెండి పట్టిని ఇవ్వగా, మెరుగు పెట్టి ఇచ్చాడు. దీంతో నమ్మకం కుదిరిన ఆమె తన మెడలోని రెండున్నర తులాల తాళి చైన్‌ను మెరుగు పట్టేందుకు ఇచ్చింది. ఆ కేటుగాడు చంద్రకళ తాళి చైన్‌కు మెరుగుపెడుతూనే పక్కనే ఉన్న పద్మావతి మహిళకు చెందిన రెండు తులాల తాళిచైన్‌కు కూడా మెరుగుపెడతానంటూ ఇప్పించుకున్నాడు. ఈ నేపథ్యంలో కొద్దిసేపు వివిధ రకాల కెమికల్స్, పౌడర్లు కలిపి తాళిచైన్లకు మెరుగుపెడుతున్నట్లుగా ఆ దుండగుడు నటించాడు. అనంతరం ఆ తాళి చైన్లను వారి ముందరే పసుపురంగు ద్రావణంలో వేసి కొద్ది సమయం తర్వాత తీసుకోవాలని చెప్పి ఆ కేటుగాడు అక్కడి నుంచి ఉడాయించాడు. కొద్ది సమయం తర్వాత తాళి చైన్లను పసుపునీటి ద్రావణంలో చూసిన ఆ మహిళలు నిశ్చేష్టులయ్యారు. రెండు తాళిచైన్లు పరిమాణం సగానికి పైగా తగ్గిపోవడంతో పాటు, బంగారు చైన్లు తుంటలు తుంటలుగా తెగి ఉండడంతో లబోదిబోమంటూ ఆ మహిళలు కోడుమూరు పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి అచూకీ కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.


