శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో లోక కల్యాణార్థమై బుధవారం సాయంత్రం సాక్షిగణపతి స్వామికి అభిషేకం, ఆలయ ప్రాంగణంలోని జ్వాలా వీరభద్రస్వామికి విశేష పూజలు నిర్వహించారు. సాక్షిగణపతి స్వామికి పంచామతాలతోను, ఫలోదకాలతోను, హరిద్రోదకం, గంధోదకం, పుష్పోదకం, కలశోధకం, శుద్ధజలంతో అభిషేకం చేసి విశేషపుష్పార్చన, నివేదన కార్యక్రమాలను చేపట్టారు. అలాగే జ్వాలా వీరభద్రస్వామి వారికి అభిషేకం, విశేషపుష్పార్చన జరిపించారు.
గుర్తు తెలియని వాహనం ఢీకొని బైకర్ మృతి
ఆత్మకూరురూరల్: ఆత్మకూరు పట్టణ శివారులో ఉన్న 340సీ జాతీయ రహదారి బైపాస్‌లో సిద్ధపల్లె క్రాసింగ్ వద్ద బుధవారం రాత్రి 10 గంటల సమయంలో గుర్తు తెలియని వాహనం ఢీ కొనడంతో మోపెడ్‌పై వెళ్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఆత్మకూరు పోలీసులు తెలిపిన మేరకు వివరాల మేరకు.. ఆత్మకూరు మండలంలోని బాపనంతాపురానికి చెందిన వెంకటేశ్వర్లు (50) సిద్ధపల్లె గ్రామంలో జరుగుతున్న ఒక ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్నాడు. తన మోపెడ్‌ను హైవే నుంచి సిద్ధపల్లె రస్తాకు మరలిస్తున్న సమయంలో వేగంగా వెళ్తున్న గుర్తు తెలియని వాహనమేదో ఢీకొంది. దీంతో వెంకటేశ్వర్లు అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


