బెదిరింపు రాజకీయాలకు భయపడం | - | Sakshi
Sakshi News home page

బెదిరింపు రాజకీయాలకు భయపడం

Jun 9 2026 8:28 AM | Updated on Jun 9 2026 8:28 AM

టీడీపీ నేతల అక్రమ ఇళ్ల నిర్మాణాలపై చర్యలు తీసుకోరేం?

కర్నూలు(టౌన్‌): నగరంలోని తన ఎస్వీ కాంప్లెక్స్‌లో డీవియేషన్‌ పేరిట విజిలెన్స్‌, టౌన్‌ప్లానింగ్‌ అధికారులు కొలతలు వేస్తూ హడావుడి చేశారని, ఇదంతా అధికార పార్టీ నేతల ఒత్తిళ్ల మేరకే చేస్తున్నారని, రాజకీయంగా వేధిస్తే భయపడేది లేదని వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌ రెడ్డి అన్నారు. సోమవారం ఎస్వీ కాంప్లెక్స్‌లోని తన చాంబర్‌లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 2005 సంవత్సరంలోనే ఎస్వీ కాంప్లెక్స్‌ వాణిజ్య భవనానికి సంబంధించి అన్ని అనుమతులు, రూ.12 లక్షల ఫీజులు చెల్లించి బీఆర్‌ఎస్‌ అనుమతి తీసుకున్నామన్నారు. రాజకీయంగా ఎదుర్కోలేక కూటమి ప్రభుత్వం బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతోందన్నారు. కర్నూలులో అధికార పార్టీ నేతలకు చెందిన ఇళ్లు, వాణిజ్య భవనాలు, హోటళ్లు, రాజసౌధాలు, ఫ్యాక్టరీల్లో డీవియేషన్లు లేవా అని ప్రశ్నించారు. అనధికార ఫ్లోర్లు లేవా..? అన్ని అనుమతులు సక్రమమేనా? అధికారం మారితే పరిస్థితి ఏమిటో ఊహించుకోవాలన్నారు. ప్రతిపక్ష నేతల ఆస్తులపై మాత్రమే తనిఖీలు చేయడం వెనుక రాజకీయ కక్ష స్పష్టంగా కనిపిస్తోందన్నారు. కక్ష సాధింపు రాజకీయాలపై న్యాయపోరాటం చేస్తామన్నారు. టీడీపీ ప్రభుత్వానికి చేతనైతే ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేసి చూపాలన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement