కర్నూలు: తన కుమారుడు సూర్యనారాయణకు ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికి ఇద్దరు మహిళలు రూ.3 లక్షలు తీసుకుని మోసం చేశారని పత్తికొండకు చెందిన షేకమ్మ, ఒకేషనల్ ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి కడపకు చెందిన గంజికుంట సురేఖ దేవి రూ.6 లక్షలు తీసుకుని మోసం చేశారని కర్నూలు శ్రీరాం నగర్‌కు చెందిన చిన్నపుల్లయ్య, కర్నూలు రిజిస్టర్ కార్యాలయంలో తన కుమారునికి ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికి ఇద్దరు వ్యక్తులు రూ.80 వేలు తీసుకుని మోసం చేశారని కర్నూలు మండలం దిన్నెదేవరపాడు గ్రామానికి చెందిన మద్దిలేటి తదితరులు ఎస్పీ విక్రాంత్ పాటిల్‌కు ఫిర్యాదు చేశారు. కర్నూలు రెండో పట్టణ పోలీస్‌స్టేషన్ పక్కనున్న క్యాంప్ కార్యాలయంలో ఎస్పీ సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులను స్వీకరించి నేరుగా వారితో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి మొత్తం 112 ఫిర్యాదులు వచ్చాయి. ఫిర్యాదులపై చట్టపరిధిలో విచారణ జరిపి త్వరితగతిన న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారు. అడ్మిన్ అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరా, సీఐలు శివశంకర్, రామయ్య నాయుడు, రామాంజులు తదితరులు కూడా పీజీఆర్‌ఎస్‌లో పాల్గొని ప్రజల నుంచి వినతులను స్వీకరించారు.


