విద్యాసంస్థల పునఃప్రారంభానికి సిద్ధం
ప్రజాదర్బార్ దరఖాస్తుల
పరిష్కారంపై ప్రత్యేక దృష్టి
ఈనెల 24 నుంచి
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్
‘సాక్షి’ ఇంటర్వ్యూలో
కలెక్టర్ దివాకర టీ.ఎస్.
సరిపడా నానో యూరియా
వర్షాలపై అప్రమత్తంగా ఉన్నాం..
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ‘ప్రజాసమస్యలను పరిష్కరిస్తూ పారదర్శకమైన పాలన అందించేలా ప్రణాళికాయుతంగా ముందుకు సాగుతున్నాం. వానాకాలం సాగు సీజన్ నేపథ్యాన ఎల్‌నినో ప్రభావం, ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు విస్తృత అవగాహన కల్పిస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్ల పునఃప్రారంభానికి క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. అకాల వర్షాలు వచ్చినా నష్టం జరగకుండా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశాం’ అని కలెక్టర్ దివాకర టీ.ఎస్. వెల్లడించారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులు, భూభారతి, సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారం తదితర అంశాలను బుధవారం ఆయన ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆ వివరాలు కలెక్టర్ మాటల్లోనే...
184 గ్రామాలపై నజర్
ఈ వానాకాలంలో ఎల్‌నినో ప్రభావం జిల్లాపై ఏ మేర ఉంటుంది.. రైతులకు కల్పించాల్సిన అవగాహన, ప్రభుత్వపరంగా తీసుకోవాల్సిన చర్యలపై ప్రణాళిక రూపొందించాం. జిల్లాలోని వనరుల్లో తగినంత నీరు ఉన్నందున తాగు అవసరాలకు ఎక్కడా ఇబ్బంది వచ్చే అవకాశం లేదు. ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోతే సాగునీరు అందని 184 గ్రామాలను గుర్తించాం. ఇందులో 64 గ్రామాల్లోని రైతులు కాల్వల చివరి భాగంలో ఉండి, బోరు బావులపై ఆధారపడి 150 ఎకరాలకు పైగా మిర్చి సాగు చేస్తారని తేలింది. అంతేకాక అత్యధిక నీరు అవసరమయ్యే పంటలు సాగు చేసే వారిని సైతం గుర్తించాం. జిల్లాలో ఏటా ఎక్కువగా సాగయ్యే వరి ఈసారి తగ్గించాలని చెబుతున్నాం. నాలుగు ఎకరాలు ఉంటే.. రెండెకరాల్లో వరి వేసి, మిర్చి అంతర్ పంటగా సాగు చేసుకోండి కానీ ఒకే పంట వేయొద్దని సూచిస్తున్నాం. ఇలా ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం.
బడుల్లో ఏర్పాట్లు
ఈ ఏడాది విద్యాసంవత్సరం ప్రారంభానికి అంతా సిద్ధంగా చేశాం. పాఠ్య, నోట్ పుస్తకాలే కాక యూనిఫామ్స్ వచ్చాయి. పాఠశాలలను శుభ్రం చేయించి టాయిలెట్లు, తాగునీటి వసతిని పరిశీలించాలని సూచించాం. అవసరమైన నిధులు కావాలన్నా ఇస్తామని చెప్పాం. కొత్తగా ప్రీ ప్రైమరీ పాఠశాలలు మంజూరయ్యాయి. ఇందులో ఒక టీచర్, ఆయా పోస్టు భర్తీకి మండలాల వారీగా త్రీమెన్ కమిటీ స్క్రూటినీ చేసి జాబితా ఇస్తే ఎంపిక చేస్తాం. విద్యా సంవత్సరం ప్రారంభంలోగా ఈ నియామకాలు పూర్తవుతాయి.
ఎస్‌ఐఆర్‌పై అపోహలు విడనాడాలి
జిల్లాలో ఈనెల 24 నుంచి ఎస్‌ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రారంభమవుతుంది. ఓటు హక్కు కోల్పోతారనే అపోహలు అవసరం లేదు. బీఎల్‌ఓల దగ్గర వివరాల ఆధారంగా మ్యాపింగ్ అయిన వారు ఎవరు, కాని వాళ్లెవరో తెలుసుకోవచ్చు. మ్యాపింగ్ అయిన వారికి సమస్య ఉండదు. మ్యాప్ అంటే 2002 ఓటరు జాబితాలో మీ పేరు ఉండాలి. అలా పేరు లేక మ్యాప్ కాని వాళ్లు 11 రకాల ధ్రువపత్రాల్లో ఏదైనా ఒకటి ఇచ్చి దరఖాస్తు చేసుకోవాలి. ఈ విషయంలో ఓటర్లు బీఎల్‌ఓలకు సహకరించాలి.
ప్రజాదర్బార్‌లో 26వేల దరఖాస్తులు
పాలేరు నియోజకవర్గాన్ని 14 క్లస్టర్లుగా విభజించి ప్రజాదర్బార్లు నిర్వహించాం. అలాగే సత్తుపల్లి నియోజకవర్గంలో ఒక ప్రజాదర్బార్ జరిగింది. మొత్తంగా 26 వేల దరఖాస్తులు అందగా, అత్యధికం ఇళ్ల కోసమే ఉన్నాయి. అలాగే పెన్షన్ల కోసం 5వేల వరకు, ఉపాధి హామీ పథకం కార్డు కోసం 600 మంది, రెవెన్యూ అంశాల్లో 4 వేల దరఖాస్తులు ఇచ్చారు. ప్రతీ దరఖాస్తులను పరిశీలించి పరిష్కరిస్తాం. పాలేరు నియోజకవర్గానికి సంబంధించి క్లస్టర్ వారీగా వచ్చిన దరఖాస్తుల పరిశీలన ఇప్పటికే కొనసాగుతోంది.
‘భూభారతి’కి పరిష్కారం
భూభారతిలో చాలా మంది దరఖాస్తులు ఇస్తున్నా మీ సేవలో అప్లై చేయడం లేదు. తద్వారా సంబంధిత వ్యక్తులు మళ్లీమళ్లీ తిరగాల్సి వస్తోంది. భూభారతికి అందే దరఖాస్తుల్లో ఎక్కువగా పీఓటీ, అసైన్‌మెంట్ అంశాలే ఉన్నాయి. ప్రభుత్వ ఆదేశాలతో వీటికి పరిష్కారం చూపుతాం. మిగతావి ఎప్పటికప్పుడు పరిశీలించి క్లియర్ చేస్తున్నాం. జిల్లాలో 70 రెవెన్యూ గ్రామాలు డిజిటల్ భూ సర్వేకు ఎంపికయ్యాయి. తొలివిడతలో తిరుమలాయపాలెం మండలం కాకరవాయి ఎంపిక కాగా.. ఆ గ్రామంలోని 3,500 ఎకరాల సర్వే 22 రోజుల్లో పూర్తి చేశాం.
ఎల్‌నినో, పంటల సాగుపై రైతులకు అవగాహన
రైతులు యూరియా తక్కువగా ఉపయోగించాలి. అందుబాటులో ఉన్న యాప్ ద్వారా యూరియా కొనుగోలు చేసుకోవచ్చు. మొదటిసారి యూరియా బస్తా వాడాక నానో యూరియా వాడితే మంచిది. ఈ యూరియా నిల్వలు జిల్లాలో సరిపడినంత ఉన్నందున ఎంతైనా వాడుకోవచ్చు. దీన్ని స్ప్రేచేస్తే చాలు ఆకులు పీల్చుకుంటాయనే అంశాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్తున్నాం.
భారీ వర్షాలు కురిసి వరద వస్తే ఎలాంటి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నాం. ఇప్పటికే ఓసారి అధికారులతో సమీక్షించగా, రెండో సమావేశం శుక్రవారం ఉంటుంది. మండలాల వారీగా తహసీల్దార్, వ్యవసాయాధికారులతో బృందాలను ఏర్పాటుచేశాం. ఆయా బృందాలు మండలాల్లో భారీ వర్షాలు పడితే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రణాళిక రూపొందించి ఇతర శాఖలతో సమన్వయం చేసుకుంటారు. ఇక మున్నేటికి వచ్చే వరద పైపొరుగు జిల్లాల నుంచి నిరంతరం వివరాలు సేకరించేలా సిద్ధమయ్యాం.


